Prince Yawar: బిగ్‌బాస్ ముగిసిన అధ్యాయం.. దయచేసి ఆ విషయం అడగొద్దన్న ప్రిన్స్ యావర్!

19 Dec, 2023 19:51 IST|Sakshi

ఈ ఏడాది బిగ్‌బాస్‌ సీజన్‌-7 గ్రాండ్‌గా ముగిసింది. గతేడాది కంటే అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా.. మరో కంటెస్టెంట్‌ అమర్‌దీప్‌ రన్నర్‌గా నిలిచాడు. అయితే ఈ సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో కంటెస్టెంట్ ఎవరంటే మాత్రం అతని పేరే చెబుతారు. వచ్చి, రానీ తెలుగుభాషతో టాప్‌-5 నిలిచాడంటే మామూలు విషయం కాదు. అతను మరెవరో కాదు ప్రిన్స్ యావర్. ఈ షో ముగిసిన తర్వాత యావర్ తొలిసారి మాట్లాడారు. పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్ గొడవ, కేసులపై యావర్ స్పందించారు. ఇంతకీ అతను ఏమన్నాడో తెలుసుకుందాం. 

యావర్ మాట్లాడుతూ..'బిగ్‌బాస్‌లో ఎవరి గేమ్ వాళ్లు ఆడారు. ఎవరి మైండ్‌ గేమ్ వారిది. పల్లవి ప్రశాంత్ నాకు బ్రదర్‌లాంటివాడు. అతనికి అభినందనలు. అతను ఎప్పుడు ఇలాగే రైతులకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. నేను కేవలం నా ఆటపైనే ఫోకస్ చేశా. గేమ్‌లో ఎలా గెలవాలని ఆలోచించా' అని అన్నారు. 

పల్లవి ప్రశాంత్‌ కేసుపై మాట్లాడుతూ..' సారీ ఈ విషయం నాకు తెలియదు. మీరు చెబితేనే నాకు తెలిసింది. కచ్చితంగా ఫీలవుతున్నా. ప్రశాంత్ మంచి మనిషి. అయితే కేసు విషయం గురించి నాకేమీ తెలియదు. మూడో రోజుల నుంచి నిద్రపోతున్నా. బిగ్‌బాస్ అనేది ముగిసిన అధ్యాయం. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. అదంతా కేవలం ఒక గేమ్ మాత్రమే. అందరూ బాగా ఆడారు. నా ఫ్యాన్స్ అందరికీ నేను రుణపడి ఉంటా. త్వరలోనే వాళ్లను కలుస్తా. నా ఫ్యామిలీ వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా.' అని వెల్లడించారు. కాగా.. ఈ సీజన్‌లో టాప్‌-4లో నిలిచిన ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. 

>
మరిన్ని వార్తలు