నా బలం... బలహీనత అదే : ప్రియాంక చోప్రా

14 Jun, 2021 00:20 IST|Sakshi
ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా ఏ విషయాన్ని ఆభరణంగా భావిస్తారు? అదృష్టం.. విధి గురించి ఆమె ఏం చెబుతారు? ... ఇవే కాదు.. జీవితంలో తాను పాటించే విషయాలు, కొన్ని జీవితసత్యాలను ఈ విధంగా చెప్పారామె.

► జీవితంలో కిందకు పడిపోవడం, తప్పులు చేయడం సహజమే. కానీ తప్పుల నుంచి నీ లోపాలను గ్రహించి నిన్ను నువ్వు మెరుగుపరచుకోవాలి. కానీ నీలా నువ్వు ఉండే స్వభావాన్ని మాత్రం కోల్పోకు. కిందపడినప్పుడు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో పైకి లేవాలి.
► అదృష్టం, విధి.. రెండూ చేతిలో చేయి వేసుకుని తిరుగుతుంటాయని నేను అనుకుంటున్నాను. చదువుకునే రోజుల్లో నేను ఇంజినీర్‌ను కావాలనుకున్నాను. కానీ నా ఫొటోలను మా అమ్మ, నా తమ్ముడు మిస్‌ ఇండియా పోటీలకు పంపారు. అసలు ఆ పోటీ అంటే ఏమిటో కూడా అప్పుడు నాకు తెలియదు. ఆ తర్వాత ఏ జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు నేను హీరోయిన్‌ని. ఇక నేను విధిని నమ్మకుండా ఎలా ఉండగలను?
► మనం ఎక్కువగా తోటివారి గురించే ఆలోచిస్తుంటాం. వారు చేసే ప్రతి పని వెనక ఏదోఒక ఎజెండా ఉందని తెగ ఆలోచిస్తుంటాం. అలాంటి ఆలోచనలను మానుకుందాం.
► జీవితం నీకు నిమ్మకాయలను ఇస్తే వాటితో నువ్వు ద్రాక్షరసం చేయడానికి ట్రై చేసి, తర్వాత నిశ్శబ్దంగా ఉండు. అంటే.. మనకు దక్కినవాటి నుంచి ఏదైనా అద్భుతం చేయడం అన్నమాట. ఆ తర్వాత ఆశ్చర్యపోవడం, ఈ అద్భుతం ఎలా జరిగిందా? అని ఆలోచించడం పక్కవారి పని.
► నీతో నువ్వు నిజాయితీగా ఉండు. నిన్ను నువ్వు అంగీకరించు. నిన్ను నువ్వు ప్రేమించుకో. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యాన్ని కోల్పోకు.
► మనం ప్రతి విషయాన్ని కంట్రోల్‌ చేయలేం. కానీ శక్తివంచన లేకుండా వచ్చిన అవకాశాన్ని వందశాతం సద్వినియోగం చేసుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది.
► మన జీవితంలో దాగి ఉన్న మలుపులు మనల్ని ఏ క్షణాన ఎటు తీసుకుని వెళతాయో మనకు తెలియదు. అందుకే ఎప్పుడూ మన జాగ్రత్తల్లో ఉండాలి. మనం ప్రేమించినవారిని జాగ్రత్తగా చూసుకోగలగాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం.
► ఆత్మవిశ్వాసం, మన ప్రతిభపై నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే. ఏదీ కష్టం కాదు.
► నా కుటుంబమే నా బలం, నా బలహీనత.
► నువ్వెంత సాధించగలవో ఎవరూ చెప్పరు. అది నువ్వే గుర్తించి, ఉన్నత స్థాయికి చేరుకోవాలి.
► ఆత్మవిశ్వాసమే నా ఆభరణం. దీన్నే నేను అందరికీ రికమెండ్‌ చేస్తాను.
► నేను సాధించాలనుకున్నదాని కోసం ఎంతైనా కష్టపడతాను. లక్ష్యానికి చేరువగా ఉన్నాయి కదా అని షార్ట్‌కట్‌ రూట్స్‌ను పాటించి ప్రమాదాలను కొని తెచ్చుకోను.
► ఒంటరి ప్రయాణానికి భయపడకు. నీ విజయాలతో పాటు అపజయాలకూ నీవే బాధ్యత వహించు.

ఒక మహిళకు ఆర్థిక స్వేచ్ఛ ఉన్నట్లయితే వారు వారికి నచ్చినట్లు తమ జీవితాన్ని జీవించగలరు అని మా అమ్మ నాతో ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఎక్కడున్నా, ఏం చేసినా, వివాహం చేసుకున్నప్పటికీ మహిళలు ఆర్థికంగా దృఢంగా ఉండాలి.  ఉపయోగించినా, ఉపయోగించకపోయినా మన దగ్గర డబ్బు ఉండాలి. మన దగ్గర డబ్బు ఉంటే జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాల నుంచి కోలుకోగలం, ధైర్యంగా ఉండగలం. మరొకరి సహాయం లేకుండా మన కాళ్ల మీద మనం నిలబడగలం.

మరిన్ని వార్తలు