వాళ్లను విశ్లేషించడం మూర్ఖత్వం!

16 Jun, 2022 05:16 IST|Sakshi

– రామ్‌గోపాల్‌ వర్మ

‘‘నాకు తెలిసిన ఓ రిటైర్డ్‌ పోలీసాఫీసర్‌ కొండా మురళిగారి గురించి చెప్పారు. ఆ తర్వాత మాజీ నక్సలైట్లతో మాట్లాడాను. కథ ఒక కొలిక్కి వచ్చాక కొండా ఫ్యామిలీని కలిసి, సినిమా గురించి చెబితే వారు ఒప్పుకున్నారు’’ అని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘కొండా’. త్రిగుణ్, ఇర్రా మోర్‌ జంటగా నటించారు.

శ్రేష్ఠ పటేల్‌ మూవీస్‌ సమర్పణలో ఆపిల్‌ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్‌పై కొండా సుష్మితా పటేల్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ  మాట్లాడుతూ– ‘‘కొండా మురళి, సురేఖల కాలేజీ జీవితం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు (1990 నుంచి 2000) ఈ సినిమా ఉంటుంది. కొండా దంపతుల కుమార్తె సుష్మిత ఈ చిత్రనిర్మాత కాబట్టి వాళ్లకు పాజిటివ్‌గా తీయలేదు.. తను నిర్మాత కాకున్నా నేను అనుకున్నది తీసేవాణ్ణి.

ప్రస్తుతం ‘లడకీ’ అనే ఓ హిందీ చిత్రం తీశాను. అమితాబ్‌ బచ్చన్‌గారితో ఓ హారర్‌ సినిమా ప్లాన్‌ చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. మనం చేసేది మనం చేస్తాం.. పరిస్థితులు ఇంకోటి చేస్తాయి. నాలుగు నెలల క్రితం ‘సినిమా టికెట్‌ రేట్లు తగ్గించి సినిమాలను చంపేస్తున్నారు’ అన్నారు. ఆ తర్వాత రేట్లు పెంచారు. ఇప్పుడు మళ్లీ తగ్గించారు. పరిస్థితులను బట్టి మారాల్సి వస్తుంది. ప్రేక్షకుడిని, ఎన్నికల్లో ఓటు వేసేవాళ్లను విశ్లేషించడమంత మూర్ఖపు పని ఇంకొకటి ఉండదు’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. 

మరిన్ని వార్తలు