Randeep Hooda: అన్నం తినకుండా మంచినీళ్లతో.. నిద్ర మాత్రలు పని చేయలేదు

29 Mar, 2024 17:23 IST|Sakshi

బయోపిక్‌ చేయాలంటే ముందు కంటెంట్‌ తెలుసుండాలి, తర్వాత దాన్ని తెరకెక్కించేందుకు గట్స్‌ ఉండాలి. ఈ రెండూ ఉన్నందువల్లే స్వతంత్ర సమరయోధుడు సావర్కర్‌ జీవితాన్ని తెరపై చూపించాలని ఆరాటపడ్డాడు నటుడు రణ్‌దీప్‌ హుడా. ఈయన ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌. ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్‌డ్‌ రివ్యూలు అందుకుంటున్న ఈ చిత్రం ఇప్పటివరకు రూ.13 కోట్లు మాత్రమే రాబట్టింది.

క్వాలిటీగా తీయాలన్న ధ్యాసే లేదు
తాజాగా అతడు ఈ బయోపిక్‌ కోసం పడ్డ కష్టాలను ఏకరువు పెట్టాడు. 'ఈ సినిమాను గతేడాది ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నాను, లేదంటే ఈ ఏడాది జనవరి 26కు రిలీజ్‌ చేద్దామనుకున్నాను. అందుకోసం ఎంతో కష్టపడ్డాను. కానీ ఏదీ జరగలేదు. మా టీమ్‌లో ఉన్నవారికి సినిమా చేద్దామని ఉందే తప్ప క్వాలిటీగా తీయాలన్న ధ్యాసే లేదు. దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. నా సినిమాకు ఎవరూ సపోర్ట్‌ చేయలేదు. దీంతో మా నాన్న నాకోసం పైసాపైసా కూడబెట్టి కొన్న ముంబైలోని రెండు, మూడు ప్లాట్లను అమ్మేశాను.

కాలికి దెబ్బ తగిలి..
మరోవైపు నా బరువు తగ్గించేందుకు కష్టాలు పడ్డాను. కేవలం బ్లాక్‌ కాఫీ, గ్రీన్‌ టీ, మంచినీళ్లు.. ఇదే నా మెనూ అయిపోయింది. తర్వాత చాక్లెట్స్‌, నట్స్‌ తినడం మొదలుపెట్టాను.. అయినా సరే, సరైన తిండి లేకపోవడంతో ఒక్కోసారి సెట్స్‌లో పడిపోయేవాడిని. ఒకసారి గుర్రంపై స్వారీ చేస్తూ కింద పడ్డాను. కాలికి బాగా దెబ్బ తగిలి రెండు నెలలు నడవలేకపోయాను. అప్పుడు కూడా అన్నం తినకుండా డైట్‌ కంటిన్యూ చేశా. ఒక చెంచా బాదం బటర్‌, ఒక చెంచా కొబ్బరి నూనె, కొన్ని నట్స్‌.. ఇదే నా రోజూవారి ఆహారం. ఈ డైట్‌ మెయింటెన్‌ చేస్తూ మూడు పనులు (డైరెక్షన్‌, యాక్టింగ్‌, ప్రొడ్యూసింగ్‌) చేయడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. నిద్రమాత్రలు వేసుకున్నా ఒక్కోసారి సరిగా నిద్రపోయేవాడినే కాదు. ఒక్కోసారి సావర్కర్‌ సెట్స్‌లోనే ఉన్నట్లుగా ఓ నీడ కనిపించేది' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: తెలుగులో ఆ సినిమాతో ఫుల్‌ క్రేజ్‌.. వివాదాలతో వార్తల్లో.. ఎవరో గుర్తుపట్టారా?

Election 2024

మరిన్ని వార్తలు