రియా కోసం తెగ బాధపడిపోతున్నాడు.. కానీ!

11 Dec, 2020 18:58 IST|Sakshi

సింగర్‌ విశాల్‌ దద్లానీపై సోనా మహాపాత్ర విమర్శలు

ముంబై: బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ విశాల్‌ దద్లానీపై గాయని సోనా మహాపాత్ర విమర్శలు గుప్పించారు. కాలానికి, మనుషులకు తగ్గట్లుగా ఆయన మనసు మారిపోతూ ఉంటుందని వంగ్యాస్త్రాలు సంధించారు. కాగా నటి తనూ శ్రీ దత్తా నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణ నేపథ్యంలో బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోనా సహా పలువురు ఆమె మద్దతుగా నిలబడ్డారు. మీటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ప్రముఖ సింగింగ్‌ రియాలిటీ షో ఇండియన్‌ ఐడల్‌ జడ్జి, సంగీత దర్శకుడు అను మాలిక్‌ తమను లైంగికంగా వేధించాడంటూ పలువురు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అతడు షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో అనూ మాలిక్‌కు వ్యతిరేకంగా సోనా బలంగా తన గొంతు వినిపించారు. బాధితుల పక్షాన నిలబడ్డారు. అయితే అనూ మాలిక్‌తో అదే వేదికను పంచుకున్న సింగర్‌ విశాల్‌ దద్లానీ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసులో అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి అరెస్టైన విషయం విదితమే. అనేక పరిణామాల అనంతరం వీరిద్దరికి బెయిలు లభించగా జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఈ విషయం గురించి గురువారం ట్విటర్‌లో ప్రస్తావించిన విశాల్‌.. ప్రముఖ జర్నలిస్టు అర్నబ్‌ గోస్వామిని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అక్కాతమ్ముళ్ల అందమైన భవిష్యత్తును నాశనం చేశారంటూ మండిపడ్డాడు. తన రాజకీయ గురువులను ప్రసన్నం చేసుకునేందుకే ఇలా చేశాడంటూ ఆరోపించాడు.(చదవండి: ‘బెల్ట్‌ తీసి కొట్టేవాడు.. వేళ్లు విరిచేవాడు’)

ఈ విషయంపై స్పందించిన ఓ నెటిజన్‌.. గురువుల మెప్పు పొందేందుకు మీటూ ఉద్యమం గురించి నోరు తెరవని నువ్వు ఇప్పుడిలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. అనుమాలిక్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని మీకు డబ్బు గురించి ఆలోచనే తప్ప ఇంకేమీ పట్టదంటూ ఘాటుగా విమర్శిస్తూ సోనా మహాపాత్రను ట్యాగ్‌ చేశారు. ఇందుకు బదులుగా.. ‘‘ మన అవసరాన్ని, సౌలభ్యాన్ని బట్టి ఏది సరైంది, ఏది కాదు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. రియా చక్రవర్తి కోసం దద్లానీ గుండె రక్తమోడుతోంది. కానీ ఇండియన్‌ ఐడల్‌లో ఆయన సహచరుడు అనూ మాలిక్‌ గురించి ఎంతో మంది మహిళలు ఆరోపణలు చేసినప్పుడు మాత్రం ఎలాంటి న్యాయన్యాయాలు గుర్తుకురాలేదు’’ అంటూ విమర్శించారు.  

మరిన్ని వార్తలు