ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

15 Aug, 2020 01:19 IST|Sakshi

చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో అత్యవసర చికిత్స

కరోనా పాజిటివ్‌తో పది రోజులుగా ఆస్పత్రిలోనే..

తాజాగా ఆయన సతీమణికీ పాజిటివ్

‌సాక్షి ప్రతినిధి, చెన్నై :  కరోనా బారినపడి గత పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్, లాక్‌డౌన్‌ కారణాలతో ఎస్పీ బాలు గత కొంతకాలంగా తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని చెన్నైలోని తన ఇంట్లోనే ఉంటున్నారు. ఈనెల 5న ఆయనకు కరోనా వైరస్‌ సోకడంతో చెన్నై చూలైమేడులోని ఎంజీఎం ప్రైవేటు ఆస్ప త్రిలో చేరారు. ‘‘దయచేసి పరామర్శించడానికి ఫోన్లు చేయొద్దు. మాట్లాడలేను. త్వరలో ఇంటికి వచ్చేస్తాను’’అని ఆ రోజు బాలు స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. ‘బాలు స్వల్పమైన కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్నారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు’అని గురువారం సాయంత్రం ఆస్పత్రి వైద్య సిబ్బంది విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు.

ఆయన రక్తంలో ఆక్సిజన్‌ శాతం సరిపడేంతగా కూడా ఉందని తెలిపారు. అయితే, గురువారం రాత్రి ఒక్కసారిగా బాలు ఆరోగ్యం విషమంగా మారడంతో వెంటనే ఐసీయూకి తర లించి అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన మరో బులెటిన్‌లో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయనకు వెంటిలేటర్‌ అమర్చారని, వైద్య నిపు ణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కుటుంబ సభ్యుల సమాచారం. మరోవైపు ఎస్పీబీ భార్య సావిత్రికి శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వారు తెలిపారు. ఎస్పీ బాలు ఆరోగ్యంపై చాలామంది ఆందోళన చెందడంతో ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌.. ట్విట్టర్‌ ద్వారా తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని తెలిపారు. ఓ తమిళ టీవీ చానల్‌లో తండ్రి ఆరోగ్యం గురించి వచ్చిన వార్త నిజం కాదన్నారు.

నాన్నగారు తిరిగొచ్చేస్తారు 
నాన్నగారు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. సేఫ్‌ హ్యాండ్స్‌ (ఎంజీఎం ఆస్పత్రిని ఉద్దేశించి)లో ఉన్నారు. వదంతులను నమ్మొద్దు. నాన్నగారు తిరిగొచ్చేస్తారని మేమంతా నమ్మకంగా ఉన్నాం. ఆయన కోసం ప్రార్థిస్తున్నవారికి ధన్యవాదాలు
  – ట్విట్టర్‌లో ఎస్పీ చరణ్

ఎవరూ కంగారుపడొద్దు
మధ్యాహ్నం అన్నయ్యకు కొంచెం క్రిటికల్‌గా ఉంది. ఆ తర్వాత స్టేబుల్‌గా ఉన్నారు. ఎవరూ కంగారుపడొద్దు. ఆయనకు విల్‌పవర్‌ ఉంది. భగవంతుడి ఆశీస్సులు, మనందరి ప్రార్థనలతో తప్పకుండా ఇంటికొస్తారు. అందరి ప్రార్థనలు ఆయనకు కొండంత అండ   
– ఎస్పీ బాలు సోదరి వసంత

మరిన్ని వార్తలు