ఈ ఏడాది నిర్మాతలుగా డామినేట్‌ చేసిన మహారాణులు

20 Dec, 2023 00:26 IST|Sakshi

‘అనుకున్న టైమ్‌కి షూటింగ్‌ పూర్తి కావాల్సిందే... ప్లాన్‌ తప్పకూడదు’ అని హుకుం జారీ చేయాలంటే చేసే పని మీద ప్రేమ, శ్రద్ధ... ఈ రెంటికీ మించి ధైర్యం, ఆత్మవిశ్వాసం లాంటివి కూడా ఉండాలి. ముఖ్యంగా ‘మేల్‌ డామినేటెడ్‌’ ఇండస్ట్రీస్‌లో ఒకటైన సినిమా పరిశ్రమలో ‘ఫీమేల్‌ప్రొడ్యూసర్‌’ రాణించాలంటే తెగువ కావాలి. అవసరమైనప్పుడు రాణిలా హుకుం జారీ చేయాలి. సున్నితంగా పనులు చక్కబెట్టడంతో పాటు కఠినంగానూ ఉండాలి. అలా రెండు రకాలుగా ఉంటూ... ‘మేం రాణిస్తాం’ అంటూ ఈ ఏడాది నిర్మాణ రంగంలోకి వచ్చిన కొందరు ఫీమేల్‌ ప్రొడ్యూసర్‌ క్వీన్స్‌ గురించి తెలుసుకుందాం

హీరోయిన్‌గా యాభైకి పైగా సినిమాలు చేశారు సమంత. అగ్రశ్రేణి నటిగా ప్రేక్షకులు కితాబులిచ్చారు.ఇప్పుడు ‘ట్రాలాలా మూవీంగ్‌ పిక్చర్స్‌’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారామె. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన కథలను ఈ నిర్మాణ సంస్థ వేదికగా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నామని సమంత పేర్కొన్నారు.

► ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు కుమార్తె హన్షితా రెడ్డి తండ్రి బాటలో నిర్మాత అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు ఇప్పటికే 50కి పైగా సినిమాలు నిర్మించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాల నిర్మాతగా ఆయనకు పేరుంది. ఇక ‘దిల్‌’రాజుప్రొడక్షన్స్‌ స్థాపించి ‘ఏటీఎమ్‌’ వెబ్‌ సిరీస్‌ నిర్మించిన హన్షిత తొలిసారి ‘బలగం’ సినిమా నిర్మించి, బ్లాక్‌బస్టర్‌ అందుకోవడంతో పాటు అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.

ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకునిగా మారారు. ఈ ఏడాది మార్చి 3న విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. అన్నట్లు.. ‘బలగం’కి హర్షిత్‌ రెడ్డి మరో నిర్మాత. ఇక ఆ మధ్య రెండు చిత్రాలు ఆరంభించిన ఈ నిర్మాతలు మంగళవారం మరో చిత్రాన్ని ఆరంభించారు.

► ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర ‘మ్యాడ్‌’ చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు. రామ్‌ నితిన్, సంగీత్‌ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యన్‌ కీలక పాత్రల్లో నటించారు. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ అక్టోబర్‌ 6న రిలీజై, హిట్‌గా నిలిచింది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను బాగా  నవ్వించింది. తొలి చిత్రంతోనే అభిరుచి ఉన్న నిర్మాత అనిపించుకున్నారు హారిక.

► తండ్రి నిమ్మగడ్డ ప్రసాద్‌ సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మేన్‌.  ఇక కూతురికి సినిమాలంటే ఫ్యాషన్‌. ఆ∙ఇష్టంతో ‘మంగళవారం’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, తొలి విజయం అందుకున్నారు స్వాతీ రెడ్డి. పాయల్‌ రాజ్‌పుత్‌ లీడ్‌ రోల్‌లో అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, ఎం. సురేష్‌ వర్మ నిర్మించిన ఈ సినిమా గత నెల 17న విడుదలై హిట్‌గా నిలిచింది.

► మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక (నాగబాబు కుమార్తె) అటు నటన, ఇటుప్రొడక్షన్‌ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకూ పలు వెబ్‌ సిరీస్‌లు, షార్ట్‌ ఫిలింస్‌ నిర్మించిన ఆమె తొలిసారి ఫీచర్‌ ఫిల్మ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా యాదు వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. అంతేకాదు.. పదకొండు మంది హీరోలు, నలుగురు  హీరోయిన్లు పరిచయమవుతుండటం విశేషం. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు.

► శ్రీకాంత్‌ మేక, రాహుల్‌ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘బన్నీ’ వాసుతో కలిసి విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న విడుదలైన ఈ పొలిటికల్, పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ హిట్‌గా నిలిచింది. 

► నటిగా, గాయనిగా, నర్తకిగా గుర్తింపు తెచ్చుకున్న రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మాతగా మారి, ‘కలశ’ చిత్రాన్ని నిర్మించారు. భానుశ్రీ, సోనాక్షీ వర్మ, అనురాగ్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కొండ రాంబాబు దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. చిన్న బడ్జెట్‌ చిత్రమైనా కాన్సెప్ట్‌ బాగుందనిపించుకుంది. 

► పాయల్‌ సరాఫ్‌కి సినిమా నేపథ్యం లేదు. అయితే నిర్మాత కావాలన్నది ఆమె కల. ‘భరతనాట్యం’ చిత్రంతో నిర్మాతగా మారారామె. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో సూర్యతేజ ఏలే హీరోగా, మీనాక్షీ గోస్వామి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్‌ కానుంది. ‘‘షూటింగ్‌ లొకేషన్‌లో అమ్మాయిలు తక్కువగా ఉంటారు. మనం అమ్మాయి అనే విషయాన్ని మరచిపోయి మన పని మనం శ్రద్ధ చేయగలిగితే సక్సెస్‌ గ్యారంటీ’’ అంటున్నారు పాయల్‌ సరాఫ్‌.

>
మరిన్ని వార్తలు