Super Star Krishna: నేడు కృష్ణ తొలి వర్ధంతి.. మరో సాయానికి శ్రీకారం చుట్టిన నమ్రత

15 Nov, 2023 13:22 IST|Sakshi

ఆంధ్రా జేమ్స్‌బాండ్‌, లెజెండరీ హీరో,  సూపర్‌ స్టార్‌ కృష్ణ ఈ లోకాన్ని వీడి ఏడాది గడిచిపోయింది. నేడు ఆయన తొలి వర్ధంతి సందర్భంగా అభిమానులు ఆయన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన వారసుడిగా ప్రిన్స్‌ మహేశ్‌ బాబు ఇండస్ట్రీలో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుని ఘట్టమనేని అనే పేరుకు గౌరవాన్ని తీసుకొచ్చారు. వారి కుటుంబంలో కృష్ణ గారి నుంచి మహేశ్‌, సితార,నమ్రత,గౌతమ్‌ అందరిలో ఒక పాయింట్‌ కామన్‌గా కనిపిస్తుంది. అదేమిటంటే..? ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం. పేదల భవిష్యత్‌ కోసం తమ వంతు సాయం చేయడం ఇవన్నీ ఘట్టమనేని కుటుంబంలో కనిపిస్తాయి.

కృష్ణ  తొలి వర్ధంతి సందర్భంగా తాజాగా నమ్రత మరో  బృహత్కార్యాన్ని తలపెట్టారు.  పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు వారు ముందుకొచ్చారు. ఇప్పటికే ఘట్టమనేని వారి సొంత ఊరు అయిన బుర్రిపాలెంలో పేదల కోసం ఒక స్కూల్‌ను నిర్మించారు. ఇలాంటి లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు  మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో నిర్వహిస్తున్నారు. సుమారు 3వేలకు పైగా చిన్నారుల గుండెకు సంబంధించిన ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు పూనుకున్నారు. ఈ విషయాన్ని నమ్రత ఇలా ప్రకటించారు. 

మామయ్య గారి పేరుతో వారికి సాయం: నమ్రత
మామయ్య గారి వర్దంతి సందర్భంగా.. ఆయన పేరు మీద ఒక స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే నలుగురు చురుకైన పేద విద్యార్థులను ఎంపిక చేశాం. ఇక నుంచి వారిని చదివించే బాధ్యతను ఎంబీ ఫౌండేషన్ తీసుకుంటుంది. వారు ఎంత వరకు చుదువుకున్నా.. అందుకు అయ్యే పూర్తి ఖర్చులు మేమే చూసుకుంటాం. ప్రస్తుతం నలుగురు విద్యార్థులను సెలక్ట్‌ చేశాం. ఈ కార్యక్రమంలో మామయ్య ఆశీస్సులు మాకు ఉంటాయని ఆశిస్తున్నాం.' నేడు నలుగురు విద్యార్థులు రేపటి రోజు ఎంతమంది అవుతారో చెప్పలేం.

మాకు చేతనైనంత వరకు పేద విద్యార్ధులను చదవించి వారి అందమైన భవిష్యత్‌కు దారి చూపించాలనేది మా లక్ష్యం.' అని నమ్రత తెలిపారు. ఘట్టమనేని ఫ్యామిలీలో సాయం చేయడం, సాటి వ్యక్తిని ఆదుకోవడం ఈనాటిది కాదు. గతంలో తన సినిమాలతో నష్టపోయిన నిర్మాతలకు కృష్ణ  గారు మరో సినిమా ఛాన్స్‌ ఇచ్చేవారు. అందుకు ఎలాంటి రెమ్యునరేషన్‌ లేకుండా ఆయన నటించేవారు. ప్రస్తుతం ఆయన వారసుడు కూడా మరో అడుగు ముందుకేసి  సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే.. ఇండస్ట్రీలో కూడా ఎన్నో గొప్ప పనులు చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరినో ఆదుకున్నారు.

తండ్రిని చూసి ఎన్నో మంచి గుణాలను మహేశ్ బాబు కూడా అలవరుచుకున్నారు. మహేశ్‌ను చూసి సితార,గౌతమ్‌ కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పేదలు, పేద పిల్లలను ఆదుకోవడంలో వారు ఎప్పుడూ ముందుంటారు.  అందులో భాగంగానే తాజాగా స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని నమ్రత ప్రకటించారు.

మరిన్ని వార్తలు