Suriya-Boyapati Srinu: తెలుగు టాప్‌ డైరెక్టర్‌తో సూర్య సినిమా.. తొందరపడ్డాడా అంటూ కామెంట్లు

23 Sep, 2023 06:57 IST|Sakshi

భారతీయ సినిమా ఇప్పుడు ఎల్లలు దాటి చాలా కాలమైంది. ఇంతకుముందు ఒక భాషలో నిర్మించిన పెద్ద హీరో చిత్రాలు మాత్రమే ఇతర భాషల్లో అనువాదం అయ్యేవి. ఆ తర్వాత ద్విభాషా చిత్రాల ఒరవడి మొదలైంది. అలాంటిది ఇప్పుడు పాన్‌ ఇండియా చిత్రాల రూపకల్పన అధికం అవుతోంది. మరో విషయం ఏమిటంటే ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని ఒక భాషలో రూపొందిస్తే వర్కౌట్‌కాని పరిస్థితి. సమీప కాలంలో ద్విభాషా చిత్రాలతో నటుడు కార్తీ, విజయ్‌, ధనుష్‌ వంటి వారు సక్సెస్‌ అయ్యారు. తాజాగా నటుడు సూర్య కూడా ఈ బాటలో పయనించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇంతకుముందు తెలుగులో రక్తచరిత్ర అనే చిత్రంలో సూర్య నటించారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. కాగా సూర్య తమిళంలో నటించిన పలు చిత్రాలు తెలుగులో అనువాదమై మంచి వసూళ్లను సాధించాయి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న కంగువ చిత్రం ఏకంగా 10 భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో ఆయన ప్రాజెక్ట్‌ ప్రారంభం కానుంది.

తాజా సమాచారం ఏంటంటే సూర్య టాలీవుడ్‌ కమర్షియల్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు ఇదేవిధంగా తెలుగులో ధనుష్‌, విజయ్‌, కార్తీ వంటి వారు సక్సెస్‌ అయ్యారు. ఒక్క శివకార్తికేయన్‌ నటించిన ప్రిన్స్‌ చిత్రం మాత్రం నిరాశపరిచింది. కాగా సూర్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో చిత్రం రూపొందడం నిజమే అయితే అది పక్కా మాస్‌ మసాలా చిత్రంగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. 

సూర్య 'స్కంద' వరకు ఆగాల్సింది 
బోయపాటి ప్రాజెక్ట్‌ను సూర్య ఓకే చేసే విషయంలో తొందర పడ్డాడా అనే చర్చ కూడా ఇండస్ట్రీలో జరుగుతుంది. ఎందుకంటే బోయపాటి ఎక్కువగా బాలకృష్ణతో మాత్రమే బ్లాక్‌బస్టర్లు ఇచ్చారు కానీ  వేరే హీరోలతో అతడికి సరైన విజయాలు లేవని చెప్పవచ్చు. అఖండ సినిమాకు ముందు 'వినయ విధేయ రామ' ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు రామ్‌తో అతను చేసిన 'స్కంద' కూడా పెద్దగా బజ్ లేదు. బోయపాటి నుంచి వచ్చే ఏ సినిమా అయినా ట్రైలర్‌ పెద్ద సంచలనమే క్రియేట్‌ చేస్తుంది. కానీ స్కంద ట్రైలర్ చూసిన మెజారిటీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. సినిమా విడుదల తర్వాత అభిప్రాయం మారవచ్చేమో చూడాలి. స్కంద హిట్‌ అయితే సూర్య సినిమాకు మరింత క్రేజ్‌ పెరగడం ఖాయం అనే వార్తలు కూడా వస్తున్నాయి.


 

మరిన్ని వార్తలు