Suryadevara Naga Vamsi: 'సినిమా ఎలా తీయాలో మీరు చెప్పాల్సిన పనిలేదు'

26 Mar, 2024 15:02 IST|Sakshi

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఏడాది మహేశ్‌ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమాపై ట్రోల్స్ వచ్చాయి. చాలా మంది గుంటూరు కారంపై విమర్శలు కూడా చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన సినిమా రిలీజ్‌ సమయంలో వచ్చిన విమర్శలకు కౌంటరిచ్చారు. పెద్ద హీరోల సినిమాలకు లాజిక్‌లతో పనిలేదని ఆయన అన్నారు. స్టార్ హీరోల ఎలివేషన్స్ చూసి సినిమాను ఎంజాయ్ చేయాలన్నారు. 

నాగవంశీ మాట్లాడుతూ.. 'సలార్‌లో ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్‌ చేశారు. కొందరు మాత్రం కొన్ని సీన్స్‌లో లాజిక్‌ లేదని కామెంట్స్‌ చేశారు. మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా తరచుగా హీరో హైదరాబాద్ వెళ్లినట్లు చూపించారు. వెంటనే ఎలా వెళ్తాడని కొందరు కామెంట్స్ చేశారు. ఇలాంటి వారి కోసం గుంటూరు టూ హైదరాబాద్‌ మూడున్నర గంటల జర్నీని సినిమాలో చూపించలేం కదా. కొందరైతే గుంటూరు కారంలో మాస్‌ సీన్స్‌ లేవని, త్రివిక్రమ్ మార్క్‌ కనిపించలేదని అన్నారు. కానీ ఓటీటీలో రిలీజ్‌ తర్వాత సినిమా చాలా బాగుందని మెసేజ్‌లు పెట్టారు' అని అన్నారు. 

గతంలో మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట చిత్రాల్లో మాస్‌ సాంగ్స్‌ చేశారు. అందుకే గుంటూరు కారంలోనూ అలాంటి సాంగ్‌ ఉంటే బాగుంటుందని కుర్చినీ మడతపెట్టి పాటను పెట్టినట్లు నాగవంశీ తెలిపారు. ఇక్కడ సినిమా చూసి ఎంజాయ్‌ చేయాలి కానీ.. ఆ టైమ్‌కు శ్రీలీల రావడం.. వెంటనే దుస్తులు మార్చుకోవడం లాంటి లాజిక్‌లు మాట్లాడకూడదని అన్నారు. సినిమాను కేవలం వినోదం రూపంలోనే చూడాలని.. ఇండస్ట్రీలోనే గొప్ప రచయిత అని పేరున్న ఆయనకు సినిమా ఎలా తీయాలో నేర్పించాల్సిన అవసరం లేదన్నారు. సినిమా బాగోలేదని కామెంట్‌ చేసే అర్హత ఎవరికైనా ఉంటుంది.. కానీ చిత్ర బృందంపై ఎవరు పడితే వారు మాట్లాడకూడదంటూ నాగవంశీ గట్టిగా బదులిచ్చారు. 

Election 2024

మరిన్ని వార్తలు