Tamil Actress Vichitra: తెలుగు హీరోపై కోలీవుడ్‌ నటి 'విచిత్ర' వ్యాఖ్యలు.. తెరపైకి వచ్చిన విజయకాంత్‌ పేరు

23 Nov, 2023 09:21 IST|Sakshi

కోలీవుడ్‌ నటి విచిత్ర ప్రస్తుతం తమిళ బిగ్‌ బాస్‌-7లో కంటెస్టెంట్‌గా కొనసాగుతుంది. ఆ షోలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. 1992లో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన విచిత్ర..  ఎక్కువగా తమిళ సినిమాల్లోనే ఆమె కనిపించింది. అక్కడ సుమారు 90కి పైగా చిత్రాల్లో  ఆమె నటించింది. తెలుగులో మాత్రం కేవలం రెండు చిత్రాల్లో మాత్రమే కనిపించగా.. ఇందులో వెంకటేశ్‌ సూపర్‌ హిట్‌ చిత్రం అయిన 'పొకిరి రాజా' (1995)లో 'చిత్ర' పాత్రతో ఆమె మెప్పించింది. ఆపై 2001లో నందమూరి బాలకృష్ణ డిజాస్టర్‌ సినిమా అయిన 'భలేవాడివి బాసు'లో 'పుష్ప' పాత్రలో కనిపించింది.

టాలీవుడ్‌ హీరోపై నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు
21 ఏళ్లుగా వెండితెరకు దూరంగా విచిత్ర తాజాగా బిగ్‌బాస్‌ షోలో తెలుగు చిత్ర పరిశ్రమ నటుడి గురించి ఓ షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టింది. 2000 సంవత్సరంలో తనకు తెలుగు సినిమా ఛాన్స్‌ వచ్చినట్లు విచిత్ర ఇలా చెప్పింది. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో ఒక ఫేమస్‌ హీరోను కలిశానని.. అతను తన గదికి రావాలని పిలిచాడు. కానీ నేను వెళ్లలేదు. దీంతో నాపై కోపం పెంచుకున్నాడు. ఆ హీరో రోజూ తాగి వచ్చి నా గది తలుపు తట్టేవాడు. అంతేకాకుండా ఓరోజు అడవిలో షూటింగ్‌ జరుగుతుండగా అతడు నన్ను అసభ్యంగా తాకాడు. అక్కడే నా జీవితంలోనే అత్యంత దారుణమైన క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాన్ని ఎదుర్కొన్నాను. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పాశాను.' అని బాంబ్‌ పేల్చింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్‌ అవుతున్నాయి.

తెరపైకి వచ్చిన విజయకాంత్‌ పేరు..ఎందుకు..?
ఈ వివాదం గురించి ఆ సమయంలో నడిగర్‌ సంఘానికి విజ్ఞప్తి చేస్తే..  అప్పట్లో నటీనటుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇవన్నీ మరిచిపోయి పని చూసుకోమన్నారని విచిత్ర తెలిపింది. కావాలంటే  పోలీసుల వద్దకు వెళ్లండి.. అసోసియేషన్‌కి ఎందుకు వచ్చారని ఎదురు ప్రశ్నించారని ఆమె వాపోయింది. ఆ తర్వాత చేసేది ఏమీ లేక సినిమాల నుంచి తప్పుకున్నట్లు విచిత్ర పేర్కొంది. అప్పట్లో నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విజయకాంత్‌పై తాజాగా విమర్శలు వస్తున్నాయి.

(ఇదీ చదవండి: తెలుగు హీరోపై కోలీవుడ్‌ నటి విచిత్ర చేసిన పూర్తి వ్యాఖ్యలు ఇవే.. )

2001లో దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడిగా విజయకాంత్ ఉన్నారు. 2000-2006 సంవత్సరం వరకు నడిగర్‌ అధ్యక్షుడిగా ఆయన కొనసాగారు. ప్రస్తుతం విచిత్ర చెప్తున్న వివాదం కూడా 2000-2001 సమయంలో జరిగినట్లు తెలిపింది. కాబట్టి ఆమె ఫిర్యాదు చేసింది కూడా విజయకాంత్‌కే ఉంటుందని నెటిజన్లు తెలుపుతున్నారు. అయితే అన్యాయం జరిగిందని సాయం కోసం ఒక ఆడపిల్ల వస్తే  విజయకాంత్ ఎందుకు సపోర్ట్ చేయలేదని చెబుతున్నారు. విజయకాంత్‌ కూడా తెలుగు హీరోకు సపోర్టుగా నిలిచాడా..? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. విజయకాంత్‌పై ఇప్పటి వరకు తమిళ పరిశ్రమలో ఎలాంటి విమర్శలు లేవు. ఒక రకంగా ఆయనపై ఇదే తొలి విమర్శ అంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.

మరిన్ని వార్తలు