తమిళ్‌ బిగ్‌బాస్‌ 5: అరగంట ఎలాంటి కట్‌, ఎడిటింగ్‌ లేకుండా టెలికాస్ట్‌

8 Oct, 2021 10:56 IST|Sakshi

Tamil Bigg Boss Seanson 5 Namitha Marimuthu Heart Touching Story: బిగ్‌బాస్‌.. ఈ రియాలిటీ షోను జెన్యూన్‌గా ఆదరించే వాళ్ల శాతం తక్కువే కావొచ్చు. చాలామందికి ఈ రియాలిటీ షో మీద సదాభిప్రాయం లేకపోయి ఉండొచ్చు. సెలబ్రిటీలు-నాన్‌ సెలబ్రిటీలను ఓ హౌజ్‌లో టాస్క్‌లు-గేమ్‌ల పేరుతో చేసే గారడీ అని, వాళ్లు పంచేవి ఫేక్‌ ఎమోషన్స్‌ అని ఫీలవుతుంటారు. ఇలా ఎవరి అభిప్రాయలు వాళ్లవి. కానీ, తమిళ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌ 5లో గురువారం టెలికాస్ట్‌ అయిన ఎపిసోడ్‌ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. 

తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ 5.. 18 మంది కంటెస్టెంట్‌లతో అక్టోబర్‌ 3న ప్రారంభమైంది. సీనియర్‌ హీరో కమల్‌ హాసన్‌ ఈ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కంటెస్టెంట్‌లో ట్రాన్స్‌జెండర్‌ నమిత మారిముత్తు పాల్గొంటోంది. మిస్‌ ట్రాన్స్‌ స్టార్‌ ఇంటర్నేషనల్‌ 2020 విన్నర్‌, మోడల్‌ కమ్‌ నటి అయిన నమిత.. ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌కు ప్రత్యేక ఆకర్షణ కావడం విశేషం. 

ఇక ‘ఒరు కథై సొల్లాటుమా’ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌ ఒక్కొక్కరు ఒక్కో కథను చెప్పుకుంటూ వచ్చారు. తన వంతు వచ్చేసరికి భావోద్వేగంగా నమిత చెప్పిన కథ తోటి హౌజ్‌ మేట్స్‌నే కాదు.. షోను తిలకించిన వాళ్లెందరినో కదిలించింది. కొందరి వల్ల సొసైటీలో తనలాంటి వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి.. సమాజం తమను అంగీకరించకపోవడం గురించి ఒక ప్రతినిధిగా దాదాపు అర్థగంట సేపు గుక్కతిప్పుకోకుండా మాట్లాడింది నమిత.

 

ఇది కదా చర్చించాల్సింది!

సొసైటీలో తనకు ఎదురైన అనుభవాలు, అవమానాల్నే కథగా అల్లిన నమిత.. ఆ కథను ఆద్యంతం భావోద్వేగాలతో చెబుతూ పోయారు. ‘మన సమాజం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. కానీ, ఇదే సమాజంలో మా స్థానం ఎక్కడ? మమ్మల్ని ఎందుకు అంగీకరించడం లేదు. ఉద్యోగాలు, అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?. మానసికంగా, శారీరకంగా మమ్మల్ని చంపేస్తున్నారు. అందుకే రోడ్ల మీద అడుక్కుని బతకాల్సి వస్తోంది.

మమ్మల్ని మనుషుల్లాగే చూడడం లేదంటూ..  కన్నీళ్లతో మాట్లాడింది నమిత. అంతేకాదు కొందరి వల్ల తనలాంటి వాళ్లకు చెడ్డ పేరు వస్తోందని, అలాంటి ప్రచారం చేసేవాళ్లతో సహా సంఘంలోని అందరిలోనూ తమపట్ల మార్పు రావాలంటూ, తనలా అందరూ రాణిస్తే సంతోషిస్తానని చివర్లో కోరుకుందామె. ఇక స్టార్‌ విజయ్‌ ఛానెల్‌ వాళ్లు కూడా సింగిల్‌ కట్‌ లేకుండా, ఎడిట్‌ చేయకుండా!, బీప్‌ లేకుండా ఆ అరగంట సీక్వెన్స్‌ను టెలికాస్ట్‌ చేయడం విశేషం!. అంతకు ముందు ఇదే హౌజ్‌లో ఇసయ్‌వాణి, చిన్నపొన్నులు సైతం పేదరికంలో తాము పడ్డ కష్టాల్ని పంచుకోగా.. ఆ రియల్‌ ఎమోషన్స్‌ సైతం చాలామందిని కదిలించాయి.  


ట్విటర్‌లో నమిత.. 
బిగ్‌బాస్‌ హౌజ్‌ వేదికగా కోట్ల మందికి తన గా(వ్య)థను పంచిన నమితను అభినందించని వాళ్లంటూ లేరు. అందుకే రాత్రి నుంచే ఆమెకు మద్దతుగా  #NamithaMarimuthu హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. బిగ్‌బాస్‌లో కడదాకా ఉంటుందో లేదో తెలియదుగానీ నమిత కథ మాత్రం.. ఓ బర్నింగ్‌ ఇష్యూను ఓ బుల్లితెర పాపులర్‌ షో ద్వారా సాధారణ ప్రజల ముందుకు తీసుకురావడం ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు తెలుగు బిగ్‌బాస్‌ 5 సీజన్‌లోనూ సాయితేజ అలియాస్‌ ప్రియాంక సింగ్‌ ఇదే తరహా ఎమోషన్స్‌ను పంచిన విషయం తెలిసిందే. కంటెంట్‌ తక్కువతో కలర్‌ఫుల్‌గా షోలను నడిపించేవాళ్లు.. తమిళ, తెలుగు బిగ్‌బాస్‌ హౌజ్‌ల నుంచి చాలా నేర్చుకోవాలనే సోషల్‌ మీడియాలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఇప్పడు.


చదవండి: తెలుగు బిగ్‌బాస్‌.. ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్‌ మర్చిపోలేని బర్త్‌డే గిఫ్ట్‌

మరిన్ని వార్తలు