ప్రకాశ్‌ రాజ్‌, బాబీ సింహాపై స్టాలిన్‌ ప్రభుత్వం చర్యలు

5 Jan, 2024 12:41 IST|Sakshi

సౌత్‌ ఇండియాలో ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, బాబీ సింహా అక్రమ నిర్మాణాల కేసుకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. కొడైకెనాల్ మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలపై మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. అక్కడ మధురై బెంచ్​ చేపట్టిన విచారణ సందర్భంగా స్టాలిన్ సర్కారు ఈ మేరకు వివరణ ఇచ్చింది. 

కొడైకెనాల్‌లో సరైన అనుమతులు లేకుండా, నిబంధనలను ఉల్లంఘించి నటులు ప్రకాష్ రాజ్, బాబీ సింహా బంగ్లా నిర్మిస్తున్నారని గతేడాది సెప్టెంబర్‌లో వివాదం తలెత్తింది. కొడైకెనాల్ కొండ ప్రాంతంలోని రైతుల రాకపోకలు కొనసాగించేన దారిలో వారు ఇల్లు నిర్మించారని అక్కడి రైతులు ఫిర్యాదు చేశారు.  నటులు ప్రకాష్ రాజ్, బాబీ సింహా నిబంధనలను ఉల్లంఘించి బంగ్లాలు నిర్మిస్తున్నారని పెతుపర గ్రామాధికారి మహేంద్రన్ ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేశారు. విల్పట్టి పంచాయతీ పరిధిలోని ప్రాంతంలో నటుడు ప్రకాష్ రాజ్ 7 ఎకరాల భూమిని, బాబీ సింహా ఒక ఎకరాన్ని కొనుగోలు చేశారు. నటీనటులిద్దరూ నిబంధనలను ఉల్లంఘించి ఆ భూమిలో బంగ్లా నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు.

కొడైకెనాల్ వంటి కొండ ప్రాంతాలలో బంగ్లాల నిర్మాణానికి తమిళనాడు బిల్డింగ్ పర్మిట్ నిబంధనల ప్రకారం సరైన అనుమతి పొందాలి. అలాగే కొండ ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి భవన నిర్మాణ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం అవసరం. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రకాష్‌రాజ్‌, బాబిసింహలు పెటుప్పరై ప్రాంతంలో బంగ్లా నిర్మించారని తెలుస్తోంది.

ఈ విషయమై ఫిర్యాదు చేసినా.. ఇద్దరూ ప్రముఖ నటులు కావడంతో ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమ నిర్మాణాల వల్ల కొండచరియలు విరిగిపడి పెద్ద నష్టం వాటిల్లుతుంది. అలాగే కొడైకెనాల్ పెటుప్పరైలో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా అధునాతన పరికరాలు  ఉపయోగించి రాళ్లను పగలగొట్టినందుకు సరైన ప్రభుత్వ అనుమతి లేకుండా ఆధునిక బంగ్లాలు నిర్మించిన నటులు ప్రకాష్‌రాజ్, బాబీ సింహలపై చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యక్తి ఎస్. మహమ్మద్ జునాథ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది ఇప్పటికే ఉన్న నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని ఆరోపించారు.

ఈ నిర్మాణాల వల్ల సమీపంలోని నివాసాలకు ముప్పు ఏర్పడిందని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణకుమార్, విజయకుమార్ ఈ పిటిషన్​పై వాదనలు విన్నారు. రెండు భవనాల నిర్మాణ పనులను నిలిపివేసినట్లు న్యాయస్థానానికి తమిళనాడు సర్కారు తెలిపింది. ఇద్దరిపైనా లీగల్ యాక్షన్ ప్రారంభించినట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ వివరణను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు- ప్రకాశ్ రాజ్, బాబీ సింహాపై తీసుకున్న చర్యలకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను జనవరి 9కి వాయిదా వేసింది.

Election 2024

Poll
Loading...
మరిన్ని వార్తలు