Middle Class Family: మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీల్లో తండ్రి-కొడుకులంతా ఇంతేనా..!

9 Oct, 2022 15:28 IST|Sakshi

మధ్య తరగతి కుటుంబం అంటేనే ప్రేమ, అప్యాయత, అనురాగాలు అంటారు. కానీ అవేవి బయటివారికి పెద్దగా కనిపించవు. ఎందుకంటే అక్కడ ప్రేమ కంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులే ఉంటాయి. దాంతో మనసులో ఎంత ప్రేమ ఉన్న వాటిని బయటికి కనబడనివ్వవు ఆర్థిక ఇబ్బందులు. అందుకే ఈ మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీల్లో తరచూ అరుపులు, గొడవలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తండ్రి-కొడుకులకు అసలు పడదు. కానీ తండ్రికి కొడుకుపై ఎనలేని ప్రేమ, కొడుకుకు తండ్రి అంటే అంతులేని గౌరవం ఉంటాయి.

 అయితే కొడుకు భవిష్యత్తుపై దిగులుతో నాన్న కొడుకుపై చిరాకు పడతాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా తాను కన్న కలలను సాకారం చేసుకోని స్థితిలో తండ్రిపై అసహనంతో ఉంటాడు కొడుకు. మరి అలాంటి వారు ఎప్పుడు ఎదురుపడినా ఏం జరుగుతుంది. గొడవలే కదా. అది సాధారణంగా అన్ని మధ్య తరగతి కుటుంబాల్లో కనిపించేదే. అలాంటి పాత్రలు వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది. మరి మధ్యతరగతి తండ్రి-కొడుకుల బాండింగ్‌ను తెరపై ఆవిష్కరించిన చిత్రాలేవో ఓసారి  చూద్దాం! 

తండ్రి, కొడుకుల సంఘర్షణే ‘నీది నాది ఒకటే కథ’:
తండ్రి, కొడుకల మధ్య ఉండే సంఘర్షణ అందరి ఇళ్లలోనూ కామన్‌గా కనిపిస్తుంది. అలాంటిదే చాలా సినిమాల్లోనూ చూశాం. కానీ…తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణే కథాంశంగా వచ్చిన చిత్రం ‘నీది నాది ఒకటే కథ’. కొడుకు బాగా బతకాలి అని తపించే తండ్రి…మనకొచ్చిన పని చేసుకుంటూ జీవితంలో సాగిపోవాలి అని నమ్మే కొడుకు. ఈ లైన్‌ని అద్భుతంగా వెండితెరపై పండించారు దేవిప్రసాద్, శ్రీవిష్ణు. మధ్య తరగతి తండ్రి పాత్రలో దర్శకుడు దేవిప్రసాద్ పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. 

విద్యలేని వాడు వింత పశువు అన్న నానుడి ఎప్పటి నుంచో సమాజంలో పాతుకుపోయింది. చదువుకోని వాడు వింత పశువేనా ? చదువురాని వాళ్లంతా పనిరాని వాళ్లేనా ? అని ప్రశ్నలు వేస్తే దర్శకుడు వేణు ఊడుగల తీసిన సినిమా…ప్రేక్షకులను థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడుతుంది. ప్రతి మధ్య తరగతి తండ్రి…ఆ మాటకొస్తే ప్రతి తండ్రి తన పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు. చదువులో వెనుక బడితే జీవితంలో వెనుక బడినట్టే అని ఆందోళన చెందుతారు. ఈ సంఘర్షణని బలంగా చూపించి, చర్చించారు ‘నీది నాది ఒకే కథ’లో.

తండ్రిని అసలు లెక్కచేయని ‘మహర్షి’
చాలా బాగా చదవాలి, గొప్పవాడు కావాలని తపనపడే మధ్య తరగతి కొడుకులకు.. ధనవంతుల తనయులు అడ్డుపడుతుంటారు. డబ్బు, పలుకుబడితో ప్రతి విషయంలో వారిని తొక్కాలని చూస్తుంటారు. అలాంటి సంఘటన ఎదురైనప్పుడల్లా తండ్రిని తలచుకుని అసహనం వ్యక్తం చేస్తుంటాడు కొడుకు. ఓడిపోయిన తండ్రిగా చూస్తూ నాన్నను అసలు లెక్కచేయడు ఆ కొడుకు. ఆ తండ్రి కూడా కొడుకు కలలకు వారధి కాలేకపోతున్నానని మదనపడుతూ తననిన తాను ఓడిపోయిన తండ్రిగా చూసుకుంటాడు. అలా ఆ తండ్రి కొడుకుల మధ్య చూపులు తప్పా మాటలే ఉండవు. ఒకే ఇంట్లో ఉన్న ఆ తండ్రి-కొడుకుల మధ్య ఏడు సముద్రాలంత దూరం ఉంటుంది. అలాంటి పాత్రలను మహర్షిలో చాలా చక్కగా చూపించాడు ‘వంశీపైడిపల్లి’. 

ఆకలి రాజ్యం:
దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు…ఆ పరిస్థితులను ఎత్తి చూపిన చిత్రం ఆకలి రాజ్యం. అదే సినిమాలో తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణని దర్శకుడు కె.బాలచందర్ అద్భుతంగా చూపించారు. తాను చెప్పినట్టుగా తనయుడు నడుచుకోవడం లేదని తండ్రి. తన దారిలో తనను వెళ్లనివ్వడం లేదని కొడుకు. ఆత్మాభిమానం విషయంలో ఇద్దరూ ఏమాత్రం తగ్గేది లేదంటారు. 

సుతిమెత్తగా తిట్టిపోసే తండ్రి ‘రఘువరన్‌ బీటెక్‌’:
మిడిల్ క్లాస్ తండ్రులను ప్రేక్షకులకు బాగా చూపించిన చిత్రాల్లో రఘువరన్ బీటెక్ ఒకటి. ధనుష్ తండ్రిగా సముద్రఖని నటించారు. కొడుకేమో సివిల్ ఇంజినీర్‌ జాబ్ వస్తే మాత్రమే చేస్తానంటాడు. ఎన్నాళ్లు ఖాళీగా కూర్చుంటావని సుతిమెత్తగా తిట్టి పోస్తూ ఉంటా డు తండ్రి. ఇలాంటి నాన్నలు మనకి ప్రతి చోట కనిపిస్తూనే ఉంటారు. అందుకే ఈ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

‘చిత్రలహరి’.. కొడుకు కోసం సైకాలజిస్ట్‌గా మారిన తండ్రి:
మిడిల్ క్లాస్ అన్న మాటలోనే అసలు విషయం అంతా ఉంది. ఇటు పూర్ ఫ్యామిలీ కోటాలోకి వెళ్లలేరు. అటు రిచ్ ఫ్యామిలీస్ సరసన నిలబడలేరు. కుటుంబ పెద్ద ఏమాత్రం బ్యాలెన్స్ తప్పి ఆ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. అందుకే…మిడిల్ క్లాస్ ఫాదర్స్‌లో పిల్లల కెరీర్ గురించి అంత ఎక్కువ తపన కనిపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే అరుపులు. తిట్లు. అవసరం అయితే నాలుగు దెబ్బలు కూడా ఉంటాయి. కానీ…ఎదిగిన కొడుకు ప్రేమ దెబ్బకి దిగాలు పడిపోతే అరుపులు, తిట్లు పని చేయవు. అప్పుడే నాన్న తనకు తాను సైకాలజిస్ట్ అయిపోతాడు. ఇలాంటి పాత్రని ‘చిత్రలహరి’ సినిమాలో అద్భుతంగా చూపించాడు దర్శకుడు కిషోర్ తిరుమల. సాయి ధరమ్ తేజ తండ్రిగా పోసాని కృష్ణ మురళి నటన అందరినీ ఆకట్టుకుంది. 

ఇడియట్‌:
నాన్న తిడతాడు. నాన్న కోప్పడతాడు. ఓకే.. బాగానే ఉంది. మరి కొడుకేం చేస్తాడు? ఏమన్నా చేస్తే నాన్న ఎందుకు తిడతాడు చెప్పండి ? చాలా ఇళ్లలో జరిగేది ఇదే. కొడుకులు చాలా సందర్భాల్లో నాన్నలను లైట్‌ తీసుకుంటారు. ఆ తండ్రి అసహనం…ఈ తనయుడి టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఇడియట్ సినిమాలో ఇలాంటి నాన్నకి యాక్షన్ చెప్పేశాడు పూరి జగన్నాథ్. 

‘కొత్త బంగారు లోకం’.. కొడుకుని కొప్పడని తండ్రి:
నాన్నలకు కోపం ఉంటుంది నిజమే. కానీ…కొందరు నాన్నలకు తమ పెంపకం మీద ఎనలేని నమ్మకం ఉంటుంది. తమ కోపాన్ని, అసహనాన్ని, పిల్లల ముందు చూపించడానికి కూడా ఇష్టపడరు. ఈ టైప్ ఆఫ్ నాన్నలు మిడిల్ క్లాస్లో కనిపించడం తక్కువే. ఆ మాటకొస్తే తెలుగు సినిమాల్లోనూ తక్కువే. ‘కొత్త బంగారు లోకం’లో అలాంటి తండ్రి పాత్రకు ప్రకాశ్‌ రాజ్‌ ప్రాణం పోశారు. 

‘అమ్మో ఒకటో తారీఖు’:
ఇప్పటి దాకా పిల్లల మీద అరిచే తండ్రులను చూశాం. అవసరమైతే రెండు దెబ్బలు వేసే తండ్రులను చూశాం. మధ్య తరగతి కుటుంబం అంటేనే… ఒంటెద్దు బండి అనే అర్థం. అలాంటి ఒంటెద్దు లాంటి తండ్రిని కళ్ల ముందుంచిన చిత్రం ‘అమ్మో ఒకటో తారీఖు’. గోవింద రావు పాత్రలో ఎల్.బి.శ్రీరాం చెలరేగిపోయారు. చాలా మధ్య తరగతి కుటుంబాల్లో తాము పేద వాళ్లం కాదన్న భావన ఉంటుంది. కానీ అక్కడ ఉండేదల్లా పేదరికమే. ఆ పరిస్థితిని, మధ్య తరగతి కుటుంబాల్లోని వ్యక్తుల ఆలోచనని, ఇంటి పెద్ద పడే ఆవేదనని వెండితెరకెక్కించడంలో దర్శకులు ఇ.వి.వి.సత్యనారాయణ సక్సెస్ అయ్యారు. 

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో రేలంగి మామయ్య:
మిడిల్ క్లాస్ డాడీస్ అనగానే…బీపీ కామన్ అన్నట్టుగా వాతావరణం ఉంటుంది. కానీ, కొందరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ పాలసీని బలంగా నమ్ముతారు. ఈ తరహా నాన్నలు నిజ జీవితంలో అరుదుగానే కనిపిస్తూంటారు. ఆమాట కొస్తే వెండితెర మీద కూడా అరుదే. అలాంటి తండ్రిని రేలంగి మామయ్య క్యారెక్టర్లో మనకు చూపించాడు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ దర్శకుడు. ఆ పాత్రకి తనదైన శైలిలో ప్రాణం పోశారు ప్రకాశ్‌ రాజ్.

‘పెళ్లి చూపులు’లో తండ్రికి చుక్కలు చూపించి విజయ్‌:
హీరో కొంచెం అల్లరి చిల్లరిగా ఉంటేనే సినిమాకి అందం. అలాంటి హీరోని తండ్రి చివాట్లు పెడితేనే అసలు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. ఈ ఫార్ములాకి దర్శకులు పదును పెడుతూ ఉండటం వల్ల…మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలు సిల్వర్‌ స్క్రీన్‌పై బాగా పండుతున్నాయి. ‘పెళ్లి చూపులు’ చిత్రంలో అలాంటి డాడీ క్యారెక్టర్లో నవ్వులు పూయించాడు నటుడు కేదార్ శంకర్. ఇక హీరో విజయ్‌ దేవరకొండ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్దగా చదువు ఎక్కని బద్దకపు కొడుకుగా తండ్రికి చుక్కలు చూపించే పాత్రలో విజయ్‌ రెచ్చిపోయాడు. 

మరిన్ని వార్తలు