తెలుగు తెరపై మలయాళ కుట్టీల.. పవన్‌, మహేశ్‌ సినిమాల్లో చాన్స్‌!

11 Dec, 2021 12:14 IST|Sakshi

కొత్త సినిమా చర్చ జరుగుతోంది... చర్చ హీరోయిన్‌ దగ్గర ఆగింది... కొత్త హీరోయిన్‌ కావాలి... ‘హల్లో మల్లు’ అంటూ టాలీవుడ్‌ నుంచి మల్లూవుడ్‌కి ఫోన్‌ వెళ్లింది.. అలా ఈ ఏడాది అరడజనకు పైగా కేరళ కుట్టిలకు ఫోన్‌ వెళ్లింది.. తెలుగు తెరకు పరిచయం కానున్న ఈ మలయాళ కుట్టీల గురించి తెలుసుకుందాం.


బాలనటి నుంచి హీరోయిన్‌గా మారి మలయాళం, తమిళ ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేశారు నజ్రియా నజీమ్‌. ‘నిరమ్‌’, ‘రాజారాణి’, ‘బెంగళూరు డేస్‌’, ‘ట్రాన్స్‌’ వంటి చిత్రాల్లోని నటన నజ్రియాను స్టార్‌ హీరోయిన్ల లిస్ట్‌లో చేర్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ నాని తాజా సినిమా ‘అంటే.. సుందరానికీ’తో తెలుగుకి ఎంట్రీ ఇస్తున్నారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నట్లు.. నజ్రియా భర్త, ప్రముఖ మలయాళ స్టార్‌ ఫాహద్‌ ఫాజిల్‌ ‘పుష్ప’తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు.

ఇక బుల్లితెరపై సూపర్‌ హిట్‌ అయి, ఇప్పుడిప్పుడే వెండితెరపై ఫేమస్‌ అవుతున్న రజీషా విజయన్‌ ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’తో తెలుగులో తొలి అడుగు వేశారు. రవితేజ హీరోగా శరత్‌ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరో మలయాళ కుట్టి అనిఖా సురేంద్రన్‌ అజిత్‌ నటించిన ‘ఎన్నై అరిందాల్‌’, ‘విశ్వాసం’ చిత్రాల్లో చైల్డ్‌ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొంది, ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తున్నారు. మలయాళ హిట్‌ ‘కప్పేలా’ తెలుగు రీమేక్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు అనిఖా. ఇందులో విశ్వస్‌ సేన్‌ హీరో.

మరోవైపు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లలోనే దాదాపు పదిహేను సినిమాలను ఖాతాలో వేసుకోవడమే కాకుండా స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం రూపొందిస్తున్న పీరియాడికల్‌ మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో ఓ కీ రోల్‌ చేసే చాన్స్‌ దక్కించుకున్నారు ఐశ్వర్యా లక్ష్మీ. ‘గాడ్సే’ ద్వారా తెలుగులో హీరోయిన్‌గా పరిచయం కానున్నారామె. సత్యదేవ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి గోపీ గణేష్‌ దర్శకుడు.

ఇంకోవైపు మ్యూజిక్‌ వీడియోస్‌తో ఫేమస్‌ అయి, హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుని దూసుకెళుతున్నారు సౌమ్యా మీనన్‌. ఈ బ్యూటీ మహేశ్‌బాబు ‘సర్కారువారిపాట’లో కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకుడు. ఇక పవన్‌కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్‌’ చిత్రంతో టాలీవుడ్‌కి హాయ్‌ చెబుతున్నారు సంయుక్తా మీనన్‌. ఇందులో రానాకు జోడీగా నటిస్తున్నారు సంయుక్తా. అలాగే కల్యాణ్‌ రామ్‌ ‘బింబిసారా’లో కూడా ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు సంయుక్తా మీనన్‌. మరి.. ఈ మల్లూవుడ్‌ కుట్టీలు తెలుగు తెరను ఏ రేంజ్‌లో రూల్‌ చేస్తారో చూడాలి. 

మరిన్ని వార్తలు