Dimple Kapadia: ఆ సూపర్‌ స్టార్‌ ఇంట్లో అడుగు పెట్టిన క్షణమే నా జీవితం ముగిసింది.. అలనాటి హీరోయిన్‌

26 Apr, 2023 09:34 IST|Sakshi

భారతీయ సినిమా తొలినాళ్లలో ఓ వెలుగు వెలిగిన సూపర్‌ స్టార్లలో రాజేశ్‌ ఖన్నా ఒకరు. వరుసగా 15 హిట్లు కొట్టిన రికార్డు ఆయన పేరు మీద ఉంది. ఇండస్ట్రీలో టాప్‌ హీరోగా వెలుగొందుతున్న రోజులవి.. ఆ సమయంలో బాబీ(1973) సినిమాతో వెండితెరపై కథానాయికగా మెరిసింది డింపుల్‌ కపాడియా. ఇది ఆమె తొలి చిత్రం. అయితే ఈ సినిమా రిలీజవడానికి ముందే తన అందచందాల గురించి జోరుగా ప్రచారం జరిగింది. అది రాజేశ్‌ ఖన్నా చెవిన పడింది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. తన చేయి పట్టుకుని నడిచాడు.

అలా 1973లో తనకంటే రెట్టింపు వయసున్న రాజేశ్‌ను పెళ్లాడింది డింపుల్‌. పెళ్లి తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారనుకున్న ఈ దంపతులు 1984లో విడిపోయారు. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. అప్పటికే వీరికి ట్వింకిల్‌ ఖన్నా, రింఖీ ఖన్నా జన్మించారు. భర్తతో విడిపోయిన తర్వాత 1985లో సాగర్‌ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది డింపుల్‌. ఆ సినిమా రిలీజ్‌ సమయంలో తను ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకోగా ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

'ఓసారి నేను, రాజేశ్‌ ఖన్నా చార్టెడ్‌ ఫ్లైట్‌లో అహ్మదాబాద్‌ వెళ్తున్నాం. అతడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాడు. విమానం దిగడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో అతడు నా కళ్లలోకి సూటిగా చూసి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. అప్పుడు నా వయసు 16 మాత్రమే! పెళ్లికి సరిగ్గా ఏడు రోజుల ముందు అతడి గురించి పూర్తిగా తెలుసుకున్నాను. చాలా త్వరత్వరగా మా పెళ్లి జరిగిపోయింది. ఏ రోజైతే ఆయనతో నా వివాహం జరిగిందో అప్పుడే నా సంతోషం, జీవితం ముగిసిపోయినట్లనిపించింది. బాబీ సినిమా తర్వాత ఒక్కో ప్రాజెక్టుకు రూ.5 లక్షలిస్తామని ఆఫర్‌ చేశారు. కానీ ఆ వయసులో కెరీర్‌ ప్రాధాన్యత అర్థం కాలేదు.

రాజేశ్‌ ఇంట్లో అడుగుపెట్టి ఆశీర్వాదం తీసుకున్న రోజు నాకెందుకో ఈ పెళ్లి వర్కవుట్‌ కాదేమో అనిపించింది. పలువురు మహిళలు ఆయన జీవితంలోకి వస్తున్నారని తెలిసినా బాధేయలేదు. కానీ మా బంధం బలంగా లేదని మాత్రం అర్థమైంది. పైగా సమానత్వం అనే మాట మా విషయంలో నిజం కాలేదు. అతడి కెరీర్‌ నెమ్మదిగా డౌన్‌ అవడంతో మా మధ్య పోట్లాటలు మరింత పెరిగాయి. చివరికి ఇద్దరం విడిపోయాం' అని చెప్పుకొచ్చింది డింపుల్‌. చిత్రపరిశ్రమలో అందరూ కాకాజీ అని పిలుచుకునే రాజేశ్‌ ఖన్నా తీవ్ర అనారోగ్యంతో 2012 జూలై 18న మరణించారు. దంపతులుగా విడిపోయినప్పటికీ డింపుల్‌.. రాజేశ్‌ ఖన్నాతో స్నేహితురాలిగానే మెదిలేవారు. ఆయన చివరి రోజుల్లోనూ వారిద్దరూ కలిసే ఉన్నారు.

చదవండి: డైరెక్టర్‌ నమ్మలేదు, రెండు ఆడిషన్స్‌​ ఇచ్చాను: హీరోయిన్‌

మరిన్ని వార్తలు