భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..! 

9 Feb, 2024 20:18 IST|Sakshi

మునుపెన్నడూ లేని రీతిలో..  దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి ప్రకటించింది భారత ప్రభుత్వం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ..  మాజీ ప్రధానులైన పీవీ నరసింహరావు, చౌదరి చరణ్‌ సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌లకు ప్రకటించారు. అంతకు ముందు మరో ఇద్దరి పేర్లను ప్రధాని మోదీ స్వయంగానే ప్రకటించిన సంగతీ తెలిసిందే. 

సాధారణంగా భారతరత్న అవార్డులను ఒకరు, ఇద్దరు, గరిష్టంగా ముగ్గురికి ఇస్తూ వస్తోంది కేంద్రం. ఆ సంప్రదాయానికి 1999లో బ్రేక్‌ పడి.. ఏకంగా నలుగురికి ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. ఆ తర్వాత మళ్లీ ఒకరు, ఇద్దరు, ముగ్గురికి ఇస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా ఐదుగురికి ప్రకటించింది. ఈ ఏడాది.. బీజేపీ దిగ్గజం ఎల్‌కే అద్వానీకి, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి థాకూర్‌కు భారతరత్నలకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ముగ్గురికి ప్రకటించడంతో మొత్తం ఐదుగురికి ఇచ్చినట్లయ్యింది.

ఐదుగురివి వేర్వేరు ప్రాంతాలు. ఇందులో స్వామినాథన్‌ మినహాయించి మిగిలిన నలుగురికి వేర్వేరు రాజకీయ నేపథ్యం ఉంది. దీంతో.. ఆయా ప్రాంతాల రాజకీయ నేతలు పార్టీలకతీతంగా తమ ప్రాంత దిగ్గజాలకు భారతరత్న దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

పీపీ నరసింహరావు

పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్‌ 28న వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు.  1991 జూన్‌ 21 నుంచి 1996 మే 16 దాకా భారత దేశానికి ప్రధానిగా పని చేశారు. అంతకు ముందు.. కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో పనిచేశారు. దేశ హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు.   

స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన పలు మంత్రిపదవులు చేపట్టారు. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న

చరణ్‌ సింగ్‌.. 
ఉత్తర ప్రదేశ్‌ మీరట్‌లో పుట్టిన పెరిగిన చరణ్‌ సింగ్‌.. 1979 జులై 28వ తేదీ నుంచి 1980 జనవరి 14వ తేదీ దాకా దేశానికి ప్రధానిగా పని చేశారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగానూ ఆయన రెండుసార్లు పని చేశారు. యూపీలో చెప్పుకోదగ్గ స్థాయిలో బలం,బలగం ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్‌డీ.. చరణ్‌ సింగ్‌ వారసులు స్థాపించిన పార్టీ), విపక్ష శిబిరానికి షాక్‌ ఇచ్చి ఎన్డీయేలో చేరుతుందన్న ప్రచారం ఉన్న సమయంలోనే.. చరణ్‌ సింగ్‌కు అవార్డు ప్రకటించడం గమనార్హం. 
ఇదీ చదవండి: గ్రామీణ ప్రజాబంధు చరణ్‌ సింగ్‌

ఎం.ఎస్‌ స్వామినాథ్‌..
భారత దేశ హరితవిప్లవ పితామహుడిగా మాన్‌కోంబు సాంబశివన్‌ స్వామినాథ్‌ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జన్మించారు. కొంతకాలం కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్‌ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్‌ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్‌ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు.  కిందటి ఏడాది సెప్టెంబర్‌ 28వ తేదీన ఆయన కన్నమూశారు.
ఇదీ చదవండి: ఆకలిపై పోరాటం జరిపిన శాస్త్రవేత్త

కర్పూరి ఠాకూర్‌
బిహార్‌ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్‌ ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న తో గౌరవించింది. బిహార్‌కు రెండు పర్యాయాలు (డిసెంబరు 1970 నుంచి జూన్‌ 1971 వరకు, డిసెంబరు 1977 నుంచి ఏప్రిల్‌ 1979 వరకు) సీఎంగా సేవలందించి.. తన పాలనా దక్షతతో జన నాయక్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు. 

1924 జనవరి 24న బిహార్‌లోని సమస్తీపూర్‌ జిల్లాలో జన్మించిన కర్పూరి ఠాకూర్‌.. అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం పనిచేశారు.జనం కోసం  నిబద్ధతతో పనిచేసిన ఆయన్ను ‘జననాయక్‌ కర్పూరి ఠాకూర్‌’ అని అక్కడి ప్రజలు పిలుస్తారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌,  నీతీశ్ కుమార్‌, రాం విలాస్‌ పాశవాన్‌ వంటి నేతలకు ఠాకూర్‌ రాజకీయ గురువు. తాను విశ్వసించిన సిద్ధాంతాలకు కట్టుబడి సుదీర్ఘకాలం పాటు బిహార్‌, దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ద్వారా గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపుపొందిన ఆయన 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు.
ఇదీ చదవండి: అరుదైన జననాయకుడు

ఎల్‌కే అద్వానీ
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి భారతరత్న గౌరవం దక్కింది. సంఘ్‌ భావజాలాన్ని అణువణువునా పుణికిపుచ్చుకుని.. అంచెలంచెలుగా రాజకీయ దిగ్గజంగా ఎదిగిన మేధావి.  అద్వానీ.. 1927 నవంబరు 8న భారత్‌లోని కరాచీ (ప్రస్తుతం పాక్‌లో ఉంది)లో జన్మించారు.  1941లో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన ఆరెస్సెస్‌లో చేరారు.దేశ విభజన తర్వాత ముంబయిలో స్థిరపడ్డ అద్వానీ.. రాజస్థాన్‌లో సంఘ్‌ ప్రచారక్‌గా పనిచేశారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు.1980లో అద్వానీ సహా కొంతమంది జన సంఘ్‌ నేతలు జనతా పార్టీని వీడారు. ఆ తర్వాత వాజ్‌పేయీతో కలిసి 1980 ఏప్రిల్‌ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌(ఎన్డీయే)కు రూపకల్పన చేసిన రాజనీతిజ్ఞుడు.  1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి అద్వానీ గెలిచారు. లోక్‌సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఉప ప్రధాని పదవిని సైతం ఆయన చేపట్టారు. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. 
ఇదీ చదవండి: గమ్యం చేరని రథ యాత్రికుడు

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega