మొదటి డోసు తీసుకున్న 21 వేల మందికి పాజిటివ్‌:‌

22 Apr, 2021 03:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మొదటి డోసుగా కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న సుమారు 21 వేల మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, రెండో డోసు తీసుకున్నాక కూడా 5,500 మంది ఈ మహమ్మారి బారినపడ్డారని కేంద్రం తెలిపింది. రెండో డోసుగా కోవాగ్జిన్‌ తీసుకున్న 17,37,178 మందిలో 0.04% మంది, కోవిషీల్డ్‌ రెండో డోసుగా తీసుకున్న 1,57,32,754 మందిలో 0.03% మంది ఇన్ఫెక్షన్‌ బారిన పడినట్లు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు.

టీకాలు వైరస్‌ వ్యాప్తిని, మరణాలను తగ్గించాయన్నారు. అయితే, టీకా తీసుకున్న తర్వాత కూడా వ్యాధి బారినపడటాన్ని బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్‌గా పిలుస్తారని ఆయన తెలిపారు. ఇలాంటి కేసులు, ప్రతి 10వేల మందిలో 2 నుంచి 4 వరకు ఉన్నాయని ఆయన అన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

‘కోవాగ్జిన్‌ టీకా 1.1 కోట్ల డోసుల్లో మొదటి డోసు తీసుకున్న 93 లక్షల మందిలో 4,208 మంది, అంటే 0.04% మంది కోవిడ్‌ బారినపడ్డారు. ఈ టీకాను రెండో డోసుగా తీసుకున్న 17,37,178 మందిలో 695 మంది, అంటే 0.04% మందికి పాజిటివ్‌గా తేలింది. అదేవిధంగా కోవిషీల్డ్‌.. మొత్తం 11.6 కోట్ల డోసుల్లో మొదటి డోసు తీసుకున్న 10 కోట్ల మందిలో 17,145 మందికి వైరస్‌ సోకింది. కోవిషీల్డ్‌ రెండో డోసుగా తీసుకున్న 1,57,32,754 మందిలో 5,014 మంది, అంటే 0.03% మంది ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు’అని వివరించారు.  

మరిన్ని వార్తలు