Amethi: రాహుల్‌ కాదు వరుణ్‌.. అమేథీ ఓటర్ల యూటర్న్‌?

26 Feb, 2024 08:56 IST|Sakshi

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమేథీ(యూపీ) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపడంతో, గాంధీ కుటుంబానికి పట్టంకట్టే స్థానికులు ఇప్పుడు వరుణ్ గాంధీవైపు చూస్తున్నారు. రాహుల్ 2019లో అమేథీ నుండి బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయినప్పటి నుంచి తన ‘కుటుంబ నియోజకవర్గాన్ని’ తిరిగి దక్కించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.  

రాహుల్ ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. అలాగే రాహుల్ తిరిగి వయనాడ్ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే..  రాయ్‌బరేలీని ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల సోనియా గాంధీ అమేథీ నియోజకవర్గ ప్రజలకు రాసిన లేఖలో భవిష్యత్తులో ఇక్కడి ప్రజలు తన కుటుంబానికి మద్దతు ఇస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

కాగా దివంగత సంజయ్ గాంధీతోపాటు తన రాజకీయ అరంగేట్రం చేసిన ప్రముఖ కాంగ్రెస్ నేత రామ్ కరణ్ సింగ్  మీడియాతో మాట్లాడుతూ.. 1980లో సంజయ్ గాంధీ అమేథీ సీటును గెలుచుకోవడంతో గాంధీ కుటుంబానికి అమేథీతో అనుబంధం ఏర్పడిందని అన్నారు. రాహుల్ గాంధీ  లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అంగీకరించకపోతే వరుణ్ గాంధీ అమేథీ నుండి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఇదేగానీ జరిగితే, తామంతా వరుణ్‌కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. 

అయితే పార్టీ విధానాలను తీవ్రంగా విమర్శించే వరుణ్ గాంధీకి బీజేపీ టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో వరుణ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ అతనికి మద్దతు ఇచ్చే అవకాశాలున్నయనే వార్తలు వినిపిస్తున్నాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు