Delhi: టీచర్‌ కుటుంబానికి రూ. కోటి చెక్కు అందించిన సీఎం 

22 May, 2021 10:06 IST|Sakshi

రూ. కోటితో పాటు మృతుడి భార్యకు ఉద్యోగం

న్యూఢిల్లీ: విధుల్లో భాగంగా కరోనాతో మరణించిన ఉపాధ్యాయుడి కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం అండగా నిలిచింది. స్వయంగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మృతుడి కుటుంబ సభ్యులను కలిసి కోటి రూపాయల చెక్కును వారికి అందజేశారు. కాగా నితిన్‌ తన్వార్‌ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. కరోనా విజృంభణ నేపథ్యంలో రేషన్‌ పంపిణీ వంటి అనేక విధుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో మహమ్మారి బారిన పడి.. ఆర్‌ఎంల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గతేడాది డిసెంబరులో కన్నుమూశారు. 

ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌, నితిన్‌ తన్వార్‌ కుటుంబానికి భారీ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘తన్వార్‌ చాలా అంకితభావం గల టీచర్‌. కష్టపడే తత్వం గలవారు. కరోనా సంక్షోభంలో రేషన్‌ పంపిణీ సహా అనేక విధుల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకడంతో మృత్యువాత పడ్డారు. ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఆయనలేని లోటు తీర్చలేం. రూ. కోటి మాత్రమే కాదు, ఆయన భార్యకు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం సహా భవిష్యత్తులో వారికి ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తాం. కోవిడ్‌పై పోరులో సమిధలు అవుతున్న వారికి అండగా ఉండటం మన బాధ్యత’’ అని పేర్కొన్నారు. కాగా నితిన్‌ తన్వార్‌కు తల్లిదండ్రులు, భార్య, సోదరుడు ఉన్నారు.  

చదవండి: దేశంలో కొత్తగా 2,57,299 కరోనా కేసులు

మరిన్ని వార్తలు