పెళ్లి వద్దనుకున్న ఫ్రీడమ్‌ ఫైటర్‌ 

15 Jul, 2022 14:55 IST|Sakshi

కె. కామరాజ్‌గా ప్రసిద్ధి చెందిన కుమారస్వామి కామరాజ్‌ స్వాతంత్య్రోద్యమ నాయకుడు. ‘భారతరత్న’ పురస్కార విజేత. నిరుపేద కల్లుగీత కుటుంబంలో పుట్టిన ఆయన ప్రజల కోసమే జీవితం అంకితం చేసి,పెళ్లి కూడా చేసుకోలేదు. కామరాజ్‌ మహాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. అనేక సందర్భాలలో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ఎనిమిది సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు.

భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న కామరాజ్, భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూకు అత్యంత సన్నిహితులు. నెహ్రూ మరణం తర్వాత 1964లో లాల్‌ బహదూర్‌ శాస్త్రిని, ఆయన తర్వాత 1966లో ఇందిరా గాంధీని ప్రధానులను చేయటంలో కామరాజ్‌ ప్రధానపాత్ర పోషించారు.

కామరాజ్‌ అనుయాయులు అభిమానంగా ఆయన్ని దక్షిణ గాంధీ, నల్ల గాంధీ అని పిలిచేవారు. 1957లో కామరాజ్‌ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత విద్యను, పాఠశాలలో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి అనేక లక్షలమంది గ్రామీణ పేదప్రజలకు విద్యావకాశం కల్పించారు. నేడు కామరాజ్‌ జయంతి. 1903 జూలై 15న ఆయన జన్మించారు.  

(చదవండి: విధి నిర్వహణలో నెహ్రూ నుంచి ప్రశంసలు అందుకున్న దుర్గాబాయ్‌)

మరిన్ని వార్తలు