MS Subbulakshmi Biography: గంధర్వ గాయని.. ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి

4 Jul, 2022 13:53 IST|Sakshi

చైతన్య భారతి: 1916–2004

‘‘ఆమె కంఠం అత్యంత మధురం. భజన పాడుతూ అందులోనే ఆమె పరవశులైపోతారు. ప్రార్థన సమయంలో ఎవరైనా అలా భగవంతునిలో లీనం అవ్వాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీనమవడం వేరు’’ అని మహాత్మాగాంధీ ఓ సందర్భంలో అన్నారు. సుబ్బులక్ష్మి సంగీతంలోని సారాంశం ఒక్కమాటలో చెప్పాలంటే ఇదే! తమిళనాడులోని మదురైలో 1916లో సుబ్బులక్ష్మి జన్మించారు. ఆమె తల్లి వీణ షణ్ముఖవడివు సంగీత విద్వాంసురాలు.

తొలి రోజుల్లో సుబ్బులక్ష్మికి సంగీత గురువు ఆమే! సుబ్బులక్ష్మి చిన్నప్పటి నుంచే కళాకారిణిగా నడక సాగించారు. పురుషుల ఆధిక్యమే చెల్లుబాటయ్యే మద్రాసు లోని మ్యాజిక్‌ అకాడమీలో 16 ఏళ్ల వయసులో ఆమె పాడుతుంటే, సంగీత ప్రపంచం ఆసక్తిగా విన్నది. పాత్రికేయుడు, సంగీత ప్రియుడు అయిన టి.సదాశివంతో ఆమె వివాహం జరిగింది. దాంతో ఆమెకు తనదైన మార్గదర్శకుడు దొరికినట్లయింది. దేశవ్యాప్తంగా పలువురితో సత్సంబంధాలున్న సదాశివం ఆమె వృత్తి జీవితానికి పూలబాట వేశారు.

రాజనీతిజు ్ఞడైన సి.రాజగోపాలాచారి సహాయంతో, సుబ్బులక్ష్మి, సదాశివం దంపతులు దేశ సాంస్కృతిక పునరుజ్జీవనంలో కేంద్రస్థానంలో నిలిచారు. సహాయ కార్యక్రమాల కోసం కచ్చేరీలు చేసిన సుబ్బులక్ష్మి, ఎంతోమంది ప్రముఖులను అభిమానులుగా సంపాదించుకున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ సైతం అభిమానే! 1954లో పద్మభూషణ్‌ దక్కిన సుబ్బులక్ష్మిని 1998లో భారతరత్న వరించింది. సంగీత కళానిధి బిరుదు పొందిన తొలి మహిళ ఆమే! కర్ణాటక సంగీతంలో నోబెల్‌ బహుమతి లాంటిదని పేరున్న ఆ బిరుదును 1968లో మ్యూజిక్‌ అకాడమీ ఆమెకు ఇచ్చింది.

1974లో రామన్‌ మెగసేసే అవార్డు దక్కింది. ఆమె గళం నుంచి వచ్చిన వేంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం, విష్ణు సహస్రనామం లాంటివి ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. ఇప్పటికీ ఆలయాల్లో, ఇళ్లల్లో సుబ్బు లక్ష్మి గళంలో ఇవి ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.  ఆమె సంగీతమే ఆమె జీవితం. అది తెలుసు కనుకనే ఆమె తన గాత్ర మాధుర్యం ద్వారా ఎందరి హృదయాలనో చూరగొన్నారు. అలాంటి మహా వ్యక్తి ప్రేమను పొందగలగడం నా అదృష్టం. నాకే కాదు, నాలాగా ఆమెను కలిసిన వారందరి విషయంలో ఇది నిజం.
– లక్ష్మీ విశ్వనాథన్,  ‘కుంజమ్మ ఓడ్‌ టు ఎ నైటింగేల్‌’ పుస్తక రచయిత్రి

మరిన్ని వార్తలు