బెంగళూర్ రామేశ్వరం కేఫ్‌ పేలుడుతో జగిత్యాలకు లింక్‌?

11 Mar, 2024 10:28 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసుతో.. తెలంగాణ జిల్లా జగిత్యాలకు సంబంధం ఉందా?.. తాజా అరెస్టుతో ఆ దిశగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ NIA మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. అయితే అతని స్వస్థలం జగిత్యాల కావడం.. పైగా అతనొక మోస్ట్‌ వాంటెడ్‌ కావడంతోకీ అంశం తెర మీదకు వచ్చింది.. 

రామేశ్వరం కేఫ్‌ బాంబు పేలుడు కేసులో.. నిషేధిత పీఎఫ్‌ఐ కీలక సభ్యుడు సలీం హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్న అతన్ని ఎన్‌ఐఏ వైఎస్సార్‌ జిల్లా(ఏపీ) మైదుకూరు మండలం చెర్లోపల్లి ప్రాంతంలో అరెస్ట్‌ చేసింది. బెంగళూరు పేలుడు కేసులో.. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. 

సలీం స్వస్థలం జగిత్యాల కేంద్రంలోని ఇస్లాంపురా. చాలాకాలంగా పరారీలో ఉన్న అతన్ని.. NIA సెర్చ్‌ టీం మైదుకూరులో అదుపులోకి తీసుకుంది. రామేశ్వరం కెఫ్‌ బాంబు పేలుడులో.. ఇతని హస్తమున్నట్టు ఎన్‌ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అలాగే సలీంతో పాటు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎండీ అబ్దుల్ అహ్మద్,  నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ ఇలాయస్ అహ్మద్ పేర్లు కూడా ఉన్నాయి. వీళ్లిద్దరి కోసం ఇప్పుడు ఎన్‌ఐఏ టీంలు గాలింపు చేపట్టాయి. 

ఇదిలా ఉంటే.. గతంలో ఉగ్రమూలాలకు కేరాఫ్‌గా జగిత్యాల పేరు పలుమార్లు వినిపించింది. ఇప్పుడు రామేశ్వరం కేఫ్‌ బాంబు పేలుళ్ల కేసు  లింకుతో మరోసారి జగిత్యాల్లో ఉగ్రమూలాలపై చర్చ నడుస్తోంది. గతంలో జగిత్యాలతో పాటు కరీంనగర​, నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు, పలువురి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Election 2024

మరిన్ని వార్తలు