బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌.. మూడు రాష్ట్రాల సీఎంల ఎంపికలో వ్యూహం ఇదే!

13 Dec, 2023 07:52 IST|Sakshi

తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిని తన ఖాతాలో వేసుకున్న బీజేపీ, వాటి ముఖ్యమంత్రులను ఎంపిక చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో కుల సమీకరణాలకు పెద్దపీట వేసిన తీరు ఆసక్తికరమైన రాజకీయ చర్చకు తెర తీసింది. ఈ విషయంలో బీజేపీ ఆచితూచి, అన్ని అంశాలనూ లోతుగా వడపోసి మరీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం ఏకంగా వారం రోజులకు పైగా మేధోమథనం చేయడం విశేషం! దాని ఫలితాలు సీఎంల ఎంపికలో కొట్టొచి్చనట్టుగానే కనిపించాయి.

గిరిజన ప్రాబల్య ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన నేతను, ఓబీసీలు గణనీయంగా ఉన్న మధ్యప్రదేశ్‌లో అదే సామాజిక వర్గ నాయకున్ని ఎంపిక చేసి చతురత ప్రదర్శించింది. రాజస్తాన్‌లో బ్రాహ్మణ నేతకు అవకాశమిచ్చింది. సీఎంల ఎంపిక కసరత్తు పూర్తిగా రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నట్టుగా స్పష్టమవుతోంది. అగ్రవర్ణ పారీ్టగా తనకున్న ముద్రను చెరిపేసుకునే క్రమంలో రాష్ట్రపతిగా ఎస్సీని, అనంతరం ఎస్టీని ఎంపిక చేసిన కమలం పార్టీ, సీఎంల ఎంపికలోనూ అదే పోకడ కనబరిచింది. ఆ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో దిగ్గజాల వంటి నేతలను కూడా ఎలాంటి శషభిషలూ లేకుండా పక్కన పెట్టడం విశేషం!.

మధ్యప్రదేశ్‌లో సీఎంగా పార్టీని విజయ తీరాలకు చేర్చిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అంతటి సీనియర్‌ మోస్ట్‌ నాయకునికి మరో చాన్సివ్వలేదు. రాజస్తాన్, ఛత్తీస్‌ల్లో పలుమార్లు సీఎంలుగా చేసిన వసుంధరా రాజె సింధియా, రమణ్‌సింగ్‌ పేర్లనైతే పరిశీలించనే లేదని తేటతెల్లమైంది. అగ్రవర్ణ ముద్రను వదిలించుకుని అందరి పార్టీగా మారే దిశగా కొన్నేళ్లుగా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు సీఎంల ఎంపిక మరోసారి అద్దం పట్టిందని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్త కులగణనను ప్రధానాంశంగా చేసుకునేందుకు కాంగ్రెస్, జేడీ(యూ) వంటి విపక్షాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో దానికి గట్టిగా చెక్‌ పెట్టే దిశగా కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలు కూడా తాజా నిర్ణయాల్లో ప్రతిఫలించాయి. 

మధ్యప్రదేశ్‌లో ‘బీసీ’ రూటు..
మధ్యప్రదేశ్‌లో సీఎంగా పూర్తి ఆరెస్సెస్‌ నేపథ్యమున్న ఓబీసీ నేత మోహన్‌ యాదవ్‌ ఎంపిక కూడా బీజేపీ ప్రాథమ్యాలకే అద్దం పట్టింది. ఇది సరిహద్దు రాష్ట్రమైన యూపీతో పాటు బిహార్లోనూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బాగా కలిసొస్తుందని పార్టీ భావిస్తోంది. అక్కడి ప్రధాన పార్టీలైన సమాజ్‌వాదీ, ఆర్జేడీల సారథ్యం యాదవ్‌ల చేతుల్లోనే ఉండటం తెలిసిందే. పైగా 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో మరోసారి క్లీన్‌స్వీప్‌ చేయడం, 40 సీట్లు బిహార్లోనూ భారీగా సీట్లు నెగ్గడం బీజేపీకి చాలా కీలకం. ఈ నేపథ్యంలో అక్కడ సంఖ్యాధికులైన యాదవులను ఆకట్టుకునేందుకు కూడా ఓబీసీ సీఎం ఎంపిక ఉపయోగపడుతుందన్నది బీజేపీ అంచనా. ఎందుకంటే ఏకంగా 120 లోక్‌సభ స్థానాలున్న యూపీ, బిహార్లలో ఓబీసీల ఓట్లు అతి కీలకం. వారిలోనూ యాదవులు యూపీలో దాదాపుగా 10 శాతం, బిహార్లో ఏకంగా 14 శాతమున్నారు. ఇక దళితుడైన జగదీశ్‌ దేవ్డా, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రాజేంద్ర శుక్లాలను ఉప ముఖ్యమంత్రులను చేయడం యూపీలోనూ బాగా కలిసొస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఉత్తరాది అంతటా రాజకీయంగా గట్టి ప్రభావం చూపే రాజ్‌పుత్‌ సామాజిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని నరేంద్రసింగ్‌ తోమర్‌ను స్పీకర్‌గా ఎంచుకుంది. 

ఛత్తీస్‌గఢ్‌లో ‘గిరిజన’ జపం..
గిరిజన రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో వారి ప్రాబల్యం సహజంగానే ఎక్కువ. ఇక్కడ గిరిజన జనాభా ఏకంగా 32 శాతం! దాంతో గిరిజన ఎమ్మెల్యే విష్ణుదేవ్‌ సాయ్‌ని ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంచుకుంది. ఓబీసీ నేతకు చాన్సివ్వాలన్న ప్రతిపాదన కూడా ఒక దశలో తెరపైకి వచ్చినా అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజన ప్రాబల్య ప్రాంతాలైన సర్గుజా, బస్తర్‌ఱ గుండుగుత్తగా బీజేపీకే జైకొట్టిన నేపథ్యంలో ఆ సామాజిక వర్గంవైపే మొగ్గినట్టు సమాచారం. ఆ ప్రాంతాల్లోని 26 ఎస్టీ ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీ ఏకంగా 22 సీట్లు నెగ్గింది. ఈ నేపథ్యంలో సాయ్‌ ఎంపిక దేశవ్యాప్తంగా గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో కలిసొస్తుందని భావిస్తోంది. సరిహద్దు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌లో 22 శాతం, జార్ఖండ్‌లో 26 శాతం గిరిజన జనాభా ఉండటం తెలిసిందే. ఇక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వరాష్ట్రమైన ఒడిశాలోనూ 23 శాతం గిరిజనులున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో 20 ఎస్టీ లోక్‌సభ స్థానాలున్నాయి. మరో 10 స్థానాల్లోనూ గిరిజన ఓట్లు కీలకంగా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే సాయ్‌ ఎంపిక జరిగినట్టు కనిపిస్తోంది. 

రాజస్తాన్‌లో కుల సమతౌల్యం..
రాజస్తాన్‌లో తొలిసారి ఎమ్మెల్యే అయిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన భజన్‌లాల్‌ శర్మకు సీఎంగా జాక్‌పాట్‌ దక్కడం కూడా బీజేపీ కుల సమీకరణల వ్యూహంలో భాగమేనంటున్నారు. నిజానికి రాజస్తాన్‌లో 7 శాతం దాకా ఉన్న బ్రాహ్మణ జనాభా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేయదు. కానీ శర్మ ఎంపిక వెనక ఆంతర్యం రాజస్తాన్‌తో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హరియాణాల్లో గణనీయంగా ఉన్న బ్రాహ్మణ వర్గాలను ఆకట్టుకోవడంగా కనిపిస్తోంది. బ్రాహ్మణులు హరియాణాలో 12 శాతం, యూపీలో 10 శాతానికి పైగా ఉంటారు. అదే సమయంలో మిగతా సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుంటూ రాచ కుటుంబీకురాలైన దియాకుమారి, దళిత నేత ప్రేమ్‌చంద్‌ బైర్వాలను ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసింది. రాష్ట్రంలో శర్మ, మధ్యప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా శుక్లా ఎంపిక ఉత్తరాది అంతటా బీజేపీకి పెట్టన కోటగా నిలుస్తూ వస్తున్న అగ్ర వర్ణ ఓటర్లను మరింత ఆకట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా కన్పిస్తోంది. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌.

>
మరిన్ని వార్తలు