నకిలీ టీకా క్యాంపులపై సీబీఐ దర్యాప్తు!

26 Jun, 2021 08:40 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

బెంగాల్‌ బీజేపీ డిమాండ్‌ 

కోల్‌కతా: నగరంలో నకిలీ కోవిడ్‌ టీకా క్యాంపుల వివాదం అధికార టీఎంసీ, బీజేపీ మధ్య వివాదం సృష్టిస్తోంది. ఈ నకిలీ క్యాంపుల వెనక టీఎంసీ లీడర్ల హస్తం ఉందని ఆరోపించిన బీజేపీ, ఈ విషయమై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు ఈ వివాదంపై దర్యాప్తునకు కోల్‌కతా పోలీసులు జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఒక సిట్‌ను ఏర్పాటు చేశారు. దేవాంగన్‌ దేవ్‌ అనే వ్యక్తి ఐఏఎస్‌ అధికారినని చెప్తూ పలు టీకా క్యాంపులు ఏర్పాటు చేసి దాదాపు 2వేల మందికి నకిలీ డోసులిచ్చాడు. గతంలో దేవాంగన్‌ పలువురు టీఎంసీ నేతలు, మంత్రులతో ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జాయింట్‌ కమిషనర్‌గా దేవ్‌ చెప్పుకున్నాడు.

ఆయన సోషల్‌ మీడియా అకౌంట్లలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఫొటోలున్నాయి. బీజేపీ ఆరోపణలను టీఎంసీ నేతలు తోసిపుచ్చారు. రాజకీయ నేతలను కలిసేందుకు పలువురు వస్తారని, వారందరితో తమకు ఎలా సంబంధం ఉంటుందని టీఎంసీ నేత ఫిర్హాద్‌ హకీం ప్రశ్నించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రమే ఈ నకిలీ టీకాల పంపిణీ జరిపిందని బురద చల్లేందుకు టీఎంసీ యత్నిస్తోందని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. ఇందులో పెద్ద కుట్ర ఉందని, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.  దేవాంగన్‌ చేసిన పని పిచ్చివాళ్లు చేసేదని పోలీసు కమిషనర్‌ సౌమెన్‌ మిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం దేవాంగన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దేవ్‌ ఆఫీసులో జరిపిన సోదాల్లో పలు యాంటీ బయాటిక్‌ ఇంజెక్షన్‌ డోసులు, నకిలీ లోగోలు లభించాయి.  ఈ మొత్తం అంశంపై స్వతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు జరపాలని కలకత్తా హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

చదవండి: 27న అఖిల పక్ష సమావేశం   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు