లాక్‌డౌన్‌? కేంద్రం కొత్త మార్గదర్శకాలు

25 Nov, 2020 18:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రాలకు కొత్త కోవిడ్-19 మార్గదర్శకాలు

కేంద్రం అనుమతిలేనిదే  లాక్‌డౌన్‌ ఉండదు

"నైట్ కర్ఫ్యూ"  విధించుకోవచ్చు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని,  జనాలను నియంత్రించాలని, కాంటాక్ట్ ట్రేసింగ్‌ను పెంచాలని రాష్ట్రాలను కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరు 1 నుంచి  ఇవి అమలవుతాయని తెలిపింది. నిర్దేశించిన నియంత్రణ చర్యలను ఖచ్చితంగా పాటించాలా అదేశించింది. ఇందుకు స్థానిక జిల్లా, పోలీసు, మునిసిపల్ అధికారులు బాధ్యత వహించాలని పేర్కొంది. (కరోనా: మన దేశంలో ఎందుకు ఇలా అవుతోంది?)

కొత్త మార్గదర్శకాలు

  • కేంద్రం అనుమతిలేకుండా రాష్ట్రాలు స్థానికంగా లాక్‌డౌన్‌ను విధించలేవు, కానీ  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం "నైట్ కర్ఫ్యూ" వంటి ఆంక్షలను అమలు చేయవచ్చు.
  • మాస్క్‌లు, భౌతికదూరం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. మార్కెట్లు, వారాంతపు సంతలకు నియమాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలో జారీ చేయనుంది.
  • కరోనా ప్రస్తుత పరిస్థితి ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రమే రాత్రి పూట కర్ఫ్యూ విధించుకోవచ్చు. ఒకవేళ లాక్‌డౌన్‌ విధించాలనుకుంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుండి అనుమతి తీసుకోవలసి ఉంటుంది.
  •  సూక్ష్మ స్థాయిలో, జిల్లా అధికారులు కంటైన్‌మెంట్ జోన్‌ల గుర్తింపులోఅప్రమత్తంగా ఉండాలి. ఈ జాబితాను రాష్ట్రాలు / కేంద్ర ప్రాంతాలు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయాలి. దీన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా షేర్‌ చేయాలి.
  • కంటైన్‌మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి. ఇంటింటికీ పర్యవేక్షణ, నిఘా ఉండాలి. వైద‍్యం, అత్యవసర సేవలు, అవసరమైన వస్తువులు, సేవల సరఫరాను మినహాఈ జోన్లలో ప్రజల కదలికలపై నియంత్రణ అమలు కావాలి. ఇందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించనివారికి తగిన జరిమానా విధించాలని ఆదేశించింది. అంతేకాదు కార్యాలయాల్లో ఫేస్ మాస్క్‌లు ధరించని వ్యక్తులపై కూడా జరిమానాలు విధించాలని తెలిపింది.
  • రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఆరోగ్య సేతు యాప్‌ను విధిగా అందరూ వినియోగించాలి. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చిన కేంద్ర హోంశాఖ  అంతర్జాతీయ ప్రయాణికులను నిబంధనల ప్రకారం అనుమతించాలని పేర్కొంది.
  • కంటైన్‌ మెంట్‌ జోన్ల వెలుపల 50శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లకు అనుమతి. క్రీడాకారుల శిక్షణ నిమిత్తం మాత్రమే స్విమ్మింగ్‌ పూల్స్‌కు అనుమతి. సామాజిక, ఆధ్యాత్మిక, క్రీడా/వినోద/ విద్య/సాంస్కృతిక/ మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య వేదిక సామర్థ్యంలో 50 శాతానికి మించకూడదు.  ఇతర కార్యక్రమాలకు 200 మందికి పైగా వ్యక్తులు అనుమతించబడరు. ఈ  నిబంధనలు 2020 డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటాయని భావిస్తున్నారు.
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు