ఇప్పటివరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..

29 Apr, 2021 15:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రోజురోజుకు కరోనా వైరస్‌ ఉధృతి పెరుగుతుండడంతో ఇప్పటిదాక తీసుకున్న కట్టడి చర్యలు ఫలించడం లేదు. మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతో ప్రజారోగ్యం దృష్ట్యా రాష్ట్రాలు విధిలేక సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నాయి. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. నేటి రాత్రి నుంచి గోవాలో లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. 

ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌ కూడా లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఇప్పటివరకు రాత్రి పూట కర్ఫ్యూతో పాటు వారాంతపు లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించగా త్వరలోనే గుజరాత్‌, కేరళ లాక్‌డౌన్‌ ప్రకటించే అవకాశం ఉంది. పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లో కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఇప్పటివరకు పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా ప్రభుత్వాలు యోచన చేస్తున్నాయి. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉండగా మరికొన్ని రాష్ట్రాల్లో వారాంతపు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధిస్తుందనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వాలు అటువైపు అడుగులు వేయడం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా మూడు, నాలుగు రోజుల్లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మహారాష్ట్ర: ఈ నెల 14వ తేదీ రాత్రి 8 గంటల నుంచి లాక్‌డౌన్‌ అమలు. మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ ముగియనుంది. అయితే కేసుల పెరుగుదలతో మళ్లీ పొడగించే అవకాశం ఉంది.
ఢిల్లీ: ఏప్రిల్‌ 19వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమలు. మరో విడత పొడగింపు. మే 3వ తేదీ ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది.
కర్నాటక: ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి 14 రోజుల లాక్‌డౌన్‌ అమలు. మే 10వ తేదీ వరకు అమల్లో ఉండే అవకాశం ఉంది.
గోవా: ఏప్రిల్‌ 29వ తేదీ 7 గంటల నుంచి మే 3 వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌.
ఉత్తరప్రదేశ్‌: ఇన్ని రోజులు వారాంతపు లాక్‌డౌన్‌ ఉండగా ఇప్పుడు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 30 నుంచి మే 4వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది.

ఈ రాష్ట్రాలు కాకుండా చాలా రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. త్వరలోనే ఆ రాష్ట్రాలు కూడా సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించేలా పరిస్థితులు ఉన్నాయి. కరోనా వైరస్‌ కట్టడికి గత్యంతరం లేక ప్రజారోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్‌ వైపు రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి.

చదవండి: ఆక్సిజన్‌ సిలిండర్‌ కోసం 24 గంటల్లో 1,300 కి.మీ జర్నీ
చదవండి: కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలె: కేంద్రమంత్రి వ్యాఖ్యలు​​​​​​​

మరిన్ని వార్తలు