కరోనా వ్యాక్సిన్‌: సీఎంలతో మాట్లాడనున్న మోదీ

8 Jan, 2021 20:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కరోనా అంతానికి వ్యాక్సిన్‌ వచ్చిన నేపథ్యంలో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. జనవరి 11వ తేదీన సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడనున్నారు. డ్రై రన్‌ విజయవంతమైన నేపథ్యంలో వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌ పంపిణీకి శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ప్రధాని సీఎంలతో సమావేశం కానున్నారు. భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లకు డీసీజీఐ అత్యవసర అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 

ముఖ్యమంత్రులతో చర్చించి వ్యాక్సిన్‌ ఎప్పటి నుంచి పంపిణీ చేయాలనే విషయమై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో ప్రయోగాత్మకంగా నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్‌ నిర్వహించగా.. అనంతరం ఇటీవల దేశవ్యాప్తంగా డ్రై రన్‌ నిర్వహించారు. తాజాగా తెలంగాణలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా డ్రై రన్‌ విజయవంతంగా చేపట్టారు. డ్రై రన్‌ సక్సెస్‌తో వ్యాక్సిన్‌ పంపిణీకి అంతా సిద్ధమైనట్టుగా భావించవచ్చు. ప్రధాని, సీఎంల సమావేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, దేశవ్యాప్తంగా ఈనెల 13 నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు