ఇకపై ఎప్పుడైనా కరోనా టీకా

4 Mar, 2021 03:29 IST|Sakshi
గోరఖ్‌పూర్‌లో టీకా కోసం క్యూలో ఉన్న వృద్ధులు

పంపిణీ వేళలపై ఆంక్షలు తొలగింపు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీ వేళలపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఇకపై రోజులో ఏ సమయంలోనైనా టీకా పొందవచ్చు. టీకా పంపిణీని మరింత వేగవంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధ్దన్‌ చెప్పారు. ప్రజలు వారి వెసులుబాటును బట్టి అనువైన వేళల్లో టీకా తీసుకోవచ్చని సూచించారు. ప్రజల ఆరోగ్యం, సమయం విలువను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. ప్రైవేట్‌ ఆసుపత్రులు కూడా ఏ వేళలోనైనా టీకా పంపిణీ చేయవచ్చని వెల్లడించారు. ఆయా ఆసుపత్రుల సామర్థ్యాన్ని బట్టి టీకా పంపిణీ వేళలను నిర్దేశించుకోవాలని సూచించారు. ఈ వేళల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని చెప్పారు.  

పెరుగుతున్న కొత్త కేసులు  
మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో వచ్చిన కొత్త కేసుల్లో 85.95 శాతం కేసులు ఆరు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు పేర్కొంది. గత వారంతో పోలిస్తే ఢిల్లీ, హరియాణాల్లోనూ కేసుల పెరుగుదల కనిపించినట్లు తెలిపింది. మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్‌లో కరోనా నియంత్రణ చర్యల్లో ఆయా రాష్ట్రాల అధికారులకు సహకరించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కేంద్ర బృందాలను పంపినట్లు పేర్కొంది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా సంబంధిత మరణాలేవీ సంభవించలేదని స్పష్టం చేసింది.   

14,989 కొత్త కేసులు
దేశంలో గత 24 గంటల్లో 14,989 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,39,516 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 98 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,57,346 కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,08,12,044  కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 97.06 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,70,126 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.53% ఉన్నాయి. మరణాల శాతం 1.41 గా ఉంది. ఇప్పటివరకూ 21,84,03,277 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. సోమవారం 7,85,220 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందని చెప్పింది. మరణిస్తున్న వారిలో 70% మందిదీర్ఘకాలిక రోగాలు ఉన్నవారే.

మరిన్ని వార్తలు