ప్రపంచానికి పెను సవాలు.. కరోనా

22 Nov, 2020 04:48 IST|Sakshi

వర్చువల్‌ జీ20 సెక్రెటేరియట్‌ ఏర్పాటు చేయాలి

జీ20 సదస్సులో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ/రియాద్‌: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎదుర్కొటున్న అతిపెద్ద సవాలు కరోనా వైరస్‌ అని ప్రధాని మోదీ జీ20 సదస్సులో వ్యాఖ్యానించారు. సౌదీ వేదికగా శనివారం జరిగిన ఈ సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. మానవ చరిత్రను మలుపు తిప్పే ఘటన కరోనా అని చెబుతూ, కరోనానంతర కాలంలో రెండు విషయాలు ప్రధానమైనవన్నారు. మొదటగా ఎక్కడినుంచైనా పని చేయడం (వర్క్‌ ఫ్రం ఎనీవేర్‌) ఇప్పుడు కొత్త విధానంగా మారిందన్నారు. ఈ సందర్భంగా జీ20 వర్చువల్‌ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.

రెండవదిగా.. నాలుగు అంశాలపై ప్రపంచం దృష్టి సారించాలని చెప్పారు. నైపుణ్యాలను భారీగా సృష్టించడం, సమాజంలోని అన్ని వర్గాల వారికి సాంకేతికత చేరేలా చూడటం, ప్రభుత్వ విధానాల్లో పాదర్శకత, పర్యావరణ పరిరక్షణ వంటి వాటిని అనుసరించాలని అన్నారు. కొత్త ప్రపంచ నిర్మాణానికి ఈ జీ20 సదస్సు పునాది కావాలని ఆకాంక్షించారు. మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి పారదర్శకత సాయపడుతుందని అన్నారు.  అనంతరం కరోనా నుంచి కోలుకొని ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడంపై పలువురు నేతలతో  చర్చలు జరిపినట్లు మోదీ ట్వీట్‌ చేశారు.

చర్చల ద్వారా పరిష్కారం: జిన్‌పింగ్‌
పరస్పర గౌరవం, సమానత్వం, ప్రయోజనాల ప్రాతిపదికన అన్ని దేశాలతో శాంతియుత సంబంధాలకు సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. జీ 20 సదస్సులో శుక్రవారం ఆయన ప్రసంగించారు. చర్చల ద్వారా భిన్నాభిప్రాయాలను తొలగించుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేయాల్సి ఉందన్నారు. కోవిడ్‌ను తరిమికొట్టేందుకు అన్ని దేశాలు ఐక్యంగా కృషి చేయాలని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీ సమర్ధవంతంగా జరిగేందుకు వనరులను ఉపయోగించుకొనేలా ప్రపంచ ఆరోగ్య సంస్థకు సహకరించాలని కోరారు.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి ప్రపంచానికి తోడ్పడతామని చెప్పారు.  కరోనా నేపథ్యంలో పేద దేశాలకు చైనా నిధులిచ్చేందుకు వీలుగా నిబంధనలను సవరిస్తున్నామన్నారు. సౌదీ వేదికగా జరిగిన ఈ సమావేశంలో అమెరికా, చైనా, భారత్, టర్కీ, ఫ్రాన్స్, యూకే, బ్రెజిల్‌ వంటి పలు దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.  ఈ సదస్సును తొలిసారి నిర్వహించనున్న అరబ్‌ దేశంగా సౌదీ నిలవనుంది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం ట్రంప్‌ పాల్గొం టున్న అంతర్జాతీయ సదస్సు కూడా ఇదే.

మరిన్ని వార్తలు