3 కోట్లు దాటిన పరీక్షలు

18 Aug, 2020 02:31 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 పరీక్షల్లో భారత్‌ మరో మైలు రాయిని దాటింది. కరోనా కట్టడికి పరీక్షలు నిర్వహించడమే మార్గమని భావిస్తున్న కేంద్రం కరోనా టెస్టులను భారీగా పెంచింది. ఇప్పటివరకు 3 కోట్ల మందికిపైగా పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. ఆగస్టు 16 నాటికి మొత్తంగా 3 కోట్ల 41 లక్షల 400 పరీక్షలు నిర్వహించి నట్టుగా తెలిపింది. జూలై 6 నాటికి కోటి పరీక్షలను పూర్తి చేస్తే, ఆగస్టు 2 నాటికి 2 కోట్లు పూర్తయ్యాయి. మరో రెండు వారాల్లో రికార్డు స్థాయిలో మరో కోటి పరీక్షలు పూర్తి చేశారు. ఇక ఆదివారం నుంచి సోమవారం మధ్య దేశంలో తాజాగా 57,981 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 26,47,663కి చేరుకుంది. 24 గంటల్లో మరో 941 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు 1.92శాతానికి తగ్గింది. (సరితకు ఆమె భర్తకు కూడా కరోనా)

ఒకే రోజు 57,584 మంది రికవరీ
కరోనా వైరస్‌ నుంచి ఒకే రోజు 57,584 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. దీంతో రికవరీ రేటు 72.51 శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,19,842కి చేరుకుంది. ట్రాక్, ట్రేస్, టెస్ట్‌ విధానాన్ని వ్యూహాత్మకంగా అమలు చేయడం వల్లే ఈ స్థాయిలో రికవరీ సాధ్యపడిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. వైరస్‌ తీవ్రత తక్కువ ఉన్నవారిని హోంక్వారంటైన్‌ చేయడం, అవసరమైన వారినే ఆస్పత్రికి తరలిస్తూ ఉండడం వల్ల కరోనా వైరస్‌ను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడం సాధ్యపడుతోందని పేర్కొంది.

మరిన్ని వార్తలు