కరోనాతో మంచాన పడ్డవారికి... లాంగ్‌ కోవిడ్‌ ముప్పు!

28 Oct, 2023 04:29 IST|Sakshi

న్యూఢిల్లీ:  కరోనా రోగుల్లో వారం పాటు, ఆపై మంచానికి పరిమితమైన వారిలో లాంగ్‌ కోవిడ్‌ లక్షణాలు ప్రస్ఫుటంగా కని్పస్తున్నట్టు తాజా పరిశోధనలో తేలింది. వారిలో చాలామంది కనీసం రెండేళ్లపాటు విపరీతమైన ఒంటి నొప్పులు తదితర లక్షణాలతో బాధపడుతున్నారట. లాన్సెట్‌ రీజనల్‌ హెల్త్‌ యూరప్‌ జర్నల్‌ అధ్యయనం ఈ మేరకు తేలి్చంది. లింగ, వయో తదితర భేదాలకు అతీతంగా అందరిలోనూ ఇది సమానంగా కనిపించినట్టు వివరించింది. కరోనాతో రెండు నెలలకు, అంతకుమించి ఆస్పత్రిపాలైన వారిలో ఈ సమస్యలు, లక్షణాలు మరింత ఎక్కువగా తలెత్తినట్టు పేర్కొంది...

ఇలా చేశారు...
► అధ్యయనం కోసం స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్‌ల్లో 64,880 మంది వయోజనులను ఎంచుకున్నారు.
► వీరంతా 2020 ఏప్రిల్‌ నుంచి 2022 ఆగస్టు మధ్య నానారకాల కొవిడ్‌ తరహా శారీరక సమస్యలను ఎదుర్కొన్నవారే.
► అందరూ పూర్తిగా, లేదా పాక్షికంగా కరోనా టీకాలు వేయించుకున్నవారే.
► వీరిలో 22 వేల మందికి పైగా కరోనా కాలంలో ఆ వ్యాధితో బాధపడ్డారు.
► వీరిలోనూ 10 శాతం మంది కనీసం ఏడు రోజులు, అంతకంటే ఎక్కువ సమయం పాటు మంచాన పడ్డారు.
ఇలా మంచాన పడ్డవారిలో చాలామంది ఇతరులతో పోలిస్తే 37 శాతం ఎక్కువ లాంగ్‌ కోవిడ్‌ లక్షణాలతో సతమతమయ్యారు. అవేమిటంటే...
► శ్వాస ఆడకపోవడం
► ఛాతీ నొప్పి
► తల తిప్పడం
► తలనొప్పి
► మంచాన పడ్డ వారితో పోలిస్తే ఇతరుల్లోనూ ఇలాంటి లక్షణాలు తలెత్తినా వాటి తీవ్రత మాత్రం అంత ఎక్కువగా లేదు
.  

లాంగ్‌ కోవిడ్‌ అంటే...
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం కోవిడ్‌ సోకిన మూడు నెలల తర్వాత దాని తాలూకు లక్షణాలు తిరగబెట్టి కనీసం రెండు నెలలు, ఆ పైనకొనసాగితే దాన్ని లాంగ్‌ కోవిడ్‌గా పేర్కొంటారు.

► కోవిడ్‌ బారిన పడ్డ వారిలో కనీసం 10 నుంచి 20 శాతం మందిలో లాంగ్‌ కోవిడ్‌ తలెత్తినట్టు పలు అధ్యయనాల్లో తేలింది. ‘‘లాంగ్‌ కోవిడ్‌ ప్రజారోగ్యానికి పెద్ద సమస్యగా మారింది. అంతర్జాతీయంగా ఎంతోమంది దీని బారిన పడ్డారు’’అని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ డాక్టోరల్‌ స్టూడెంట్‌ ఎమిలీ జోయ్స్‌ వివరించారు. ‘అందుకే కోవిడ్‌ తాలూకు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావంపై ఓ కన్నేసి ఉంచాలి. కనీసం రెండేళ్ల దాకా శారీరక మార్పులు, సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉండాలి’అని సూచించారు.

మరిన్ని వార్తలు