కవలల విషాదం: అమ్మా నువ్వేదో దాస్తున్నావ్‌ చెప్పు.. అంతలోనే

18 May, 2021 09:40 IST|Sakshi
కరోనాతో మృతి చెందిన 24 ఏళ్ల కవలలు(ఫొటో కర్టెసీ: ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌)

కవలల జీవితాల్లో విషాదం నింపిన కరోనా

చెట్టంత కొడుకులు కళ్ల ముందే కన్నుమూశారు

కలిసి పుట్టిన అన్నదమ్ములు గంటల వ్యవధిలో ప్రాణాలు విడిచారు

తల్లిదండ్రులకు తీరని కడుపుకోత

వెబ్‌డెస్క్‌: ఏప్రిల్‌ 23, 1997. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన గ్రెగరీ రైమండ్‌ రఫేల్‌ జీవితంలో మర్చిపోలేని రోజు. తన భార్య సోజా పండంటి మగ కవలలకు జన్మనిచ్చిందని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎప్పుడెప్పుడు భార్యాపిల్లలను చూస్తానా అంటూ ఆస్పత్రి గది బయట తిరగాడిన క్షణాలు ఆయనకు ఇంకా గుర్తే. పిల్లలకు జోఫ్రెడ్‌ వాగెసే గ్రెగరీ, రాల్‌ఫ్రెడ్‌ వాగెసే గ్రెగరీ అని పేర్లు పెట్టుకున్నారు రేమండ్‌ దంపతులు. 

ఇక జంట కవలలకు ఒకరంటే ఒకరికి ప్రాణం. ఏం చేసినా కలిసే చేసేవారు. ఇద్దరూ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లే. కోయంబత్తూరులోని కారుణ్య యూనివర్సిటీ నుంచి పట్టా పుచ్చుకున్నారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో భాగంగా జోఫ్రెడ్‌ అసెంచర్‌లో ఉద్యోగం సంపాదిస్తే.. రాల్‌ఫ్రెడ్‌ హుందాయ్‌ మ్యుబిస్‌ కంపెనీ(హైదరాబాద్‌ కార్యాలయం)లో ఉద్యోగానికి కుదిరాడు. ఆరు అడుగుల ఎత్తుతో, ఆకట్టుకునే రూపాలతో ఉండే కొడుకులు.. ముఖ్యంగా ప్రతీ పనిలోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉండే కలివిడితనం చూసి రేమండ్‌  దంపతులు మురిసిపోని రోజు లేదు. 

పసిపాపలుగా ఉన్ననాటి నుంచే అన్నదమ్ములు ఒకరికిపై ఒకరు చూపే ఆప్యాయతకు తల్లిదండ్రులే ముగ్ధులయ్యేవారు. అంతటి అనుబంధం ఆ కవలలది. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ అలాంటిది. అంతా సవ్యంగా, సంతోషంగా సాగిపోతోందనుకున్న వారి జీవితాల్లో కరోనా పెను విషాదాన్ని నింపుతుందని ఊహించలేకపోయారు. కలిసి పుట్టిన కవలలు కోవిడ్‌ బారిన పడి రోజు వ్యవధిలో మరణించడం తట్టుకోలేకపోతున్నారు. చెట్టంత ఎదిగిన కొడుకులు కళ్ల ముందే కన్నుమూయడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. 

నెగటివ్‌ వచ్చింది.. కానీ అంతలోనే
తమ జీవితంలోని తీరని విషాదం గురించి కవలల తండ్రి రేమండ్‌ మాట్లాడుతూ..‘‘ఇద్దరూ వర్క్‌ ఫ్రం హోం ఆప్షన్‌ ఉండటంతో ఇంటికి వచ్చారు. ఏప్రిల్‌ 23న అన్నదమ్ములిద్దరికీ జ్వరం వచ్చింది. ఎందుకైనా మంచిదని వైద్యుల సలహాతో మెడికేషన్‌ ప్రారంభించారు. కానీ వారం రోజుల్లోనే పరిస్థితి దిగజారిపోయింది. మే 1 వాళ్లను స్థానిక ఆస్పత్రిలో చేర్పించాం. కోవిడ్‌ అని తేలింది. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడంతో వెంటే వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స మొదలుపెట్టారు. కాస్త పరిస్థితి మెరుగుపడింది అనుకున్నాం. 

పది రోజుల తర్వాత ఇద్దరికీ నెగటివ్‌ వచ్చింది. కానీ.. కానీ మూడు రోజుల్లోనే అంతా తలకిందులైంది. జాఫ్రెడ్‌ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. ఈ విషయాన్ని మేం రాల్‌ఫ్రెడ్‌కు చెప్పలేదు. తనను చూసేందుకు మేం వెళ్లగానే.. ‘‘అమ్మా.. నువ్వేదో దాస్తున్నాం. ఏదో జరిగింది. నాకు చెప్పడం లేదు కదా. చెప్పమ్మా ప్లీజ్‌’’ అని వాళ్ల అమ్మను అడిగాడు. 24 గంటలు గడవకముందే తను కూడా తనకెంతో ఇష్టమైన కవల సోదరుడి దగ్గరకు వెళ్లిపోయాడు. మూడు నిమిషాల వ్యవధిలో పుట్టిన మా కవలలు, రోజు వ్యవధిలో శాశ్వతంగా మమ్మల్ని విడిచివెళ్లిపోయారు. నిజానికి తన ప్రియమైన సోదరుడు జాఫ్రెడ్‌ లేకుండా రాల్‌ఫ్రెడ్‌ ఒంటరిగా ఇంటికి రాడని నేను ముందే ఊహించాను’’అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

మమ్మల్ని సంతోషపెట్టాలనుకున్నారు
టీచర్లమైన తాము ఎంతకష్టపడి పిల్లలను పెంచామో వాళ్లకు తెలుసునని, అందుకే తమకు లోకంలోని అన్ని సంతోషాలు ఇవ్వాలని కొడుకులు ఎంతో శ్రమించేవారని, విదేశాల్లో స్థిరపడాలని కలలు కన్నారని గుర్తుచేసుకున్నారు. కానీ దేవుడు మాత్రం వాళ్లకు ఊహించని శిక్ష విధించాడంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా రేమండ్‌ దంపతులకు కవలల కంటే ముందు కుమారుడు నెల్‌ఫ్రెడ్‌ జన్మించాడు. ప్రస్తుతం అతడొక్కడే వారి బాధను కొంతనైనా తీర్చగలిగే ఆశాదీపం.

మేం కాపాడలేకపోయాం..
ఇద్దరూ ఎంతో ఫిట్‌గా ఆరు అడుగుల ఎత్తుతో బలంగా ఉన్నారు. కానీ కోవిడ్‌ వారిని బలితీసుకుంది. మేమెంతగా ప్రయత్నించినా ఆ కవలలను కాపాడలేకపోయాం అంటూ వారికి చికిత్స అందించిన వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: Plasma Therapy: ప్లాస్మా థెరపీ నిలిపివేత 

>
మరిన్ని వార్తలు