మే 2 నుంచి లాక్‌డౌన్‌ ఉంటుందా అంటూ బెట్టింగ్‌లు! 

16 Apr, 2021 13:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ‌: దేశ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. సెకండ్‌ వేవ్‌లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 2,17,353 కరోనా కేసులు నమోదు కాగా, 1185 మరణాలు సంభవించాయి. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య 15,69,743గా ఉంది. భారత్‌లో ఇప్పటివరకు 11.72 కోట్ల మందికి పైగా టీకాలు వేయించుకున్నారు. కరోనా బాధితుల రికవరీ రేటు 88.31 శాతంగా ఉండగా మరణాల శాతం 1.23. 

తెలంగాణలో
ఇక తెలంగాణలోనూ రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3,840 కోవిడ్‌ కేసులు వెలుగుచూడగా, 9 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 30,494 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 505, మేడ్చల్‌లో 407, నిజామాబాద్‌లో 303 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో  3,41,885 కరోనా కేసులు వెలుగులోకి రాగా, 1,797 మంది కోవిడ్‌తో మృతి చెందారు.

లాక్‌డౌన్‌పై బెట్టింగ్‌
ఇదిలా ఉంటే, కొంతమంది వ్యక్తులు కరోనా తీవ్రతను కూడా క్యాష్‌ చేసుకునే దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. సెకండ్‌వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ విషయమై భారీగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుకీలు బెట్టింగ్‌ దందాకు తెరతీశారు. మే 2 నుంచి దేశంలో లాక్‌డౌన్ ఉంటుందంటూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. నెలరోజుల పాటు లాక్‌డౌన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్ బెట్టింగ్‌లపై పోలీసులు నిఘాపెట్టారు.

>
మరిన్ని వార్తలు