పెరుగుట తరుగుట కొరకే.. కరోనాకు కూడా ఇదే!

10 Apr, 2021 09:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరోనా.. వద్దు హైరానా!

పెరుగుట తరుగుట కొరకే

నెలాఖరుకు విశ్వరూపం..

మే ఆఖరుకు తగ్గుముఖం

కరోనా కేసులపై వైద్యనిపుణుల విశ్లేషణ

నేటి నుంచి ఆంక్షలు

అతిక్రమిస్తే భారీగా జరిమానా

సాక్షి ప్రతినిధి, చెన్నై: పెరుగుట తరుగుట కొరకే అనే సామెత కరోనా కేసులకూ వర్తిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఏప్రిల్‌లో పాజిటివ్‌ కేసులు విశ్వరూపం దాలుస్తాయి, మే ఆఖరుకు తగ్గుముఖం పట్టి ఊరటనిస్తాయని వైద్యనిపుణులు ధైర్యం చెబుతున్నారు. కొత్త ఆంక్షలు, ఎన్నికల ప్రచారం సద్దుమణిగినందున కేసులు కూడా తగ్గుముఖం పడ తాయని విశ్లేషిస్తున్నారు. తమిళనాడులో ప్రస్తుతం కరోనా కేసులు రోజుకు 4వేలు దాటాయి. చెన్నైలో 1500 కేసులు నమోదవుతున్నాయి.

గత 8 రోజుల్లో 28,713 మంది కరోనా వైరస్‌కు గురికాగా, 121 మంది మృత్యువాతపడ్డారు. ఎన్నికల సమయంలో నేతలు కరోనా జాగ్రత్త చర్యలు పాటించకపోవడమే పాజిటివ్‌ కేసుల పెరుగుదలకు కారణమని విశ్లేషించారు. ఏప్రిల్‌ మాసాంతానికి కరోనా కేసులు తారాస్థాయికి చేరుకుంటాయి, ప్రస్తుతం ఎన్నికల హడావుడి సద్దుమణగడం, లాక్‌డౌన్‌ సడలింపులు ఎత్తివేసి ఆంక్షలు విధించినందున మే నుంచి తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నారు.

జరిమానా టార్గెట్‌ రోజుకు రూ.10 లక్షలు.. 
కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఆంక్షలు అతిక్రమించిన వారిపై జరిమానాలతో బాదనుంది. గత ఏడాదిలా కరోనా కేసులు విశ్వరూపం దాల్చకుండా రాష్ట్ర ప్రభుత్వం రెండురోజుల క్రితం అనేక అంక్షలను ప్రకటించింది. ఈ ఆంక్షలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రకాష్‌ శుక్రవారం అదనపు ఆంక్షలతో ప్రకటన విడుదల చేశారు.

వివరాలు..‘కరోనా సెకెండ్‌ వేవ్‌’ ప్రబలుతోంది.
మాస్కు తప్పక ధరించాలి.
కనీసం ఆరు అడుగుల భౌతికదూరం పాటించాలి.
ప్రయివేటు సంస్థల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు కబసుర, నిలవేంబు కషాయం, జింక్, మల్టీ విటమిన్‌ మాత్రలు సరఫరా చేయాలి.
మాస్క్‌ ధరించకుంటే రూ.200, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే రూ.500, సెలూన్, జిమ్, వర్తక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలు, కార్యాలయాలలో నిబంధనలు పాటించకుంటే రూ.5వేలు జరిమానా విధించాలని చెన్నై కార్పొరేషన్‌ నిర్ణయించింది. రెండుసార్లు ఆంక్షలు అతిక్రమిస్తే సీలు వేస్తామని హెచ్చరించింది.

కరోనా కట్టడికి చెన్నైలోని 16 మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించి జరిమానా కింద అందరూ కలిసి రోజుకు రూ.10 లక్షలు వసూలు చేయాలని టార్గెట్‌ పెట్టింది. ఉత్తర చెన్నైలో కరోనా ఆంక్షలు పాటించకుండా మద్యం బార్లకు చేరుకునేవారు పాజిటివ్‌ బారినపడే ప్రమాదం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. చెన్నై పశ్చిమ సైదాపేటలోని ఒక అపార్టుమెంటులో నివసిస్తున్న ఏడు కుటుంబాల్లో 14 మందికి కరోనా లక్షణాలు బయటపడడంతో మొత్తం అపార్టుమెంటుకు సీలు వేశారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారు హోం ఐసోలేషన్‌ పాటించాలని సూచించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్లస్‌టూ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం 23 నిబంధనలను రూపొందించారు.

ఆంక్షలపై ఆందోళన.. 
చెన్నై కోయంబేడు మార్కెట్‌లో హోల్‌సేల్‌ అమ్మకాలు మాత్రమే సాగాలని విధించిన ఆంక్షలను నిరసిస్తూ రిటైల్‌ వ్యాపారస్తులు సీఎండీఏ ప్రధాన కార్యాలయం ముందు శుక్రవారం అందోళనకు దిగారు. గత ఏడాది ఎదుర్కొన్న నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో మళ్లీ విధించిన ఆంక్షలు ఆవేదనకు గురిచేస్తున్నాయని చిన్న వ్యాపారస్తులు వాపోతున్నారు. సుమారు 20 వేల కుటుంబాలకు ఈ ఆంక్షలు విఘాతమని ఆవేదన వ్యక్తం చేశారు. 

పుదుచ్చేరీలో కరోనా ఆంక్షలు.. 
పుదుచ్చేరీలో సైతం ఈనెల 10వ తేదీ నుంచి కరోనా ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఇన్‌చార్జ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలి పారు. పుదుచ్చేరీ బీజేపీ అధ్యక్షులు కుమరన్‌ స్వామినాథన్‌కు కరోనా వైరస్‌ సోకడంతో ఆస్పత్రిలో చేరారు.  

చదవండి: కరోనా డేంజర్‌: 24 గంటల్లో 1,45,384 కేసులు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు