కరోనా వ్యాక్సిన్ : గరిష్ట ధర రూ. 225

7 Aug, 2020 17:27 IST|Sakshi

గేట్స్ ఫౌండేషన్‌తో సీరం ఇన్‌స్టిట్యూట్  కీలక ఒప్పందం

గరిష్ట ధర  సుమారు 225 రూపాయలు

సాక్షి, న్యూఢిల్లీ: పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా (ఎస్‌ఐఐ) అతితక్కువ ధరలో కోవిడ్-19 వాక్సీన్ అందుబాటులోకి తెచ్చేందుకు కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్ తయారీ కోసం గేట్స్ ఫౌండేషన్ నుండి గవి ద్వారా 150 మిలియన్ డాలర్ల నిధులు సీరంకు అందుతాయి.  (కరోనా వాక్సిన్: నోవావాక్స్ శుభవార్త)

ప్రధానంగా ఇండియాలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్న తరుణంలో 10 కోట్ల మోతాదుల కరోనా వైరస్ వాక్సీన్లను తయారీ చేయనున్నామని ఎస్‌ఐఐ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు డీల్‌పై సంతకాలు చేసినట్టు తెలిపింది. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధర గరిష్టంగా 3 డాలర్లు (సుమారు 225 రూపాయలు) ఉంటుందని, వీటిని 92 దేశాల్లో గవికి చెందిన కోవ్యాక్స్ అడ్వాన్స్ మార్కెట్ కమిట్‌మెంట్(ఏఎంసీ)లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. 2021 చివరి నాటికి కోట్లాది వాక్సిన్లను అందించాలనేది ప్రధాన లక్ష్యమని ఒక ప్రకటనలో తెలిపింది. బిల్‌గేట్స్, గేట్స్‌ ఫౌండేషన్‌, గావిసేత్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఎస్‌ఐఐ సీఈఓ అధమ్ పూనావల్లా ట్వీట్ చేశారు. 2021నాటికి అతి తక్కువ ధరలో ప్రపంచంలోని వెనుకబడిన దేశాలకు వ్యాక్సిన్‌ పంపిణీని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వాక్సీన్ల ప్రాప్యత విషయంలో చాలా వెనుక బడిన దేశాలు ఇబ్బందులు పడటం గతంలో చూశామని గవి సీఈఓ డాక్టర్ సేథ్ బెర్క్ లీ  అన్నారు.

కాగా ఎస్‌ఐఐ సంస్థతో తమవాక్సిన్ సరఫరా, లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు నోవావాక్స్ ఈ వారంలో ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకాతో తయారీ ఒప్పందాలను ఎస్‌ఐఐ ఇప్పటికే కుదుర్చుకుంది. అటు దేశంలో చివరి దశ మానవ పరీక్షలకు ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు