కరోనా విలయం: డీఆర్‌డీవో డ్రగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

8 May, 2021 16:26 IST|Sakshi

డీఆర్‌డీవో, రెడ్డీస్‌ అభివృద్ది చేసిన యాంటీ- కోవిడ్‌ మందు

అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

గ్లూకోజ్‌ రూపంలో రానున్న  2-డియోక్సీ-డి-గ్లూకోజ్  

క్లినికల్‌ ట్రయల్స్‌లో  మెరుగైన ఫలితాలు

సాక్షి,న్యూడిల్లీ : కోవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీవో)కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్లో‌ని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో ఢిల్లీలోని ఐఎన్‌ఎంఏఎస్‌ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్) ల్యాబ్‌ రూపొందించిన యాంటీ   కరోనా డ్రగ్‌కు అనుమతి సాధించింది. ఇప్పటికే నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌ అద్భుతమైన ఫలితాల నేపథ్యంలో అత్యవసర ఉపయోగం కోసం యాంటీ-కోవిడ్ 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధానికి డీసీజీఐ  అనుమతి మంజూరు చేసింది.  తీవ్రమైన  కోవిడ్‌ బాధితుల్లో ఈ మందు అమోఘంగా పని చేస్తుందని, వేగంగా కోలుకోవడంతోపాటు ఆక్సిజన్‌పై అధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుందని డీఆర్‌డీవో తాజాగా ప్రకటించింది. 

గ్లూకోజ్‌ రూపంలో ఉండే  2-డీజీ  ఔషధాన్ని దేశంలో సులభంగా ఉత్పత్తి చేయడంతోపాటు, విరివిగా అందుబాటులో తీసుకరాచ్చని  కంపెనీ చెబుతోంది. ఈ డ్రగ్‌ సాజెట్‌లలో పొడి రూపంలో లభిస్తుంది. దీన్ని నీటిలో కరిగించి నోటి ద్వారా తీసుకోవాలి.  ఇది వైరస్‌ వ్యాపించిన భాగాల్లోకి చేరి అక్కడ  సెల్స్‌లోని కరోనా శక్తిని అడ్డుకోవడంతోపాటు, విస్తరణను గణనీయంగా  నిరోధిస్తుంది.  దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి  విస్తరణ, బాధితులు ఆక్సిజన్‌పై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ డ్రగ్‌  ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.  అలాగే రోగులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని కూడా బాగా తగ్గిస్తుందని అంచనా.

ఐఎన్‌ఎంఏఎస్- డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహాయంతో ప్రయోగాల్లో వైరస్‌కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది. దీంతో గత  ఏడాది మేలో  కోవిడ్ -19 రోగులలో  పరీక్షలకు డీసీజీఐ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) రెండో దశకు అనుమతినిచ్చింది.  వీటి ఫలితాల ఆధారంగా  డిసెంబర్ 2020 - మార్చి 2021 మధ్య 220 మంది రోగులపై మూడో  క్లినికల్ ట్రయల్ నిర్వహించారు.  ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు గుజరాత్‌కు చెందిన 27 కోవిడ్‌ ఆసుపత్రులలో ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది.  '2-డియోక్సీ-డి-గ్లోకోజ్' (2-డీజీ)గా వ్యవహరిస్తున్న ఈ యాంటీ-కోవిడ్-19 చికిత్స ఔషధాన్ని కోవిడ్ బాధితుల మీద పరీక్షించినప్పుడు వారిలో అత్యధిక శాతం మందికి ఆర్‌టీ పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ ఫలితాల వచ్చాయి. ఈ ఫలితాల వివరణాత్మక డేటాను  డీసీజీఐకి సమర్పించిన నేపథ్యంలో తాజా అనుమతి లభించింది.

చదవండి : కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు