పాజిటివ్‌ వ్యక్తుల్లో ధైర్యం నింపేందుకు.. ఢిల్లీ సర్కార్‌ వినూత్న కార్యక్రమం

11 Jan, 2022 14:38 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: స్వీయ రక్షణ చర్యలతోనే కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని చెప్పిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బాధితులు త్వరగా కోలుకునేందుకు, వారిలో ధైర్యం నింపేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు యోగా/ప్రాణాయామంపై అవగాహన కల్పించే కార్యక్రమం చేపడుతున్నట్టు ట్విటర్‌లో మంగళవారం పేర్కొన్నారు. యోగా ద్వారా రోగ నిరోధకశక్తి పెంచుకోవచ్చని చెప్పారు. యోగా క్లాసులకు సంబంధించి పాజిటివ్‌ వ్యక్తుల ఫోన్లకు నేడు ఒక లింక్‌ పంపిస్తామని బుధవారం నుంచి బ్యాచ్‌ల వారీగా ఆన్‌లైన్‌లో క్లాసులు మొదలవుతాయని సీఎం పేర్కొన్నారు. 

కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో లాక్‌డౌన్‌ పెట్టే యోచనలేదని ఇదివరకే కేజ్రీవాల్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రజలంతా కోవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తే లాక్‌డౌన్‌ పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక ఢిల్లీలో రోజూవారీ కోవిడ్‌ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 19,166 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో 65,806 యాక్టివ్‌ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ మొత్తం సంఖ్య 8,21,446. అలాగే ఢిల్లీలో ఇప్పటివరకు 546 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి.
(చదవండి: టెక్‌ ఫాగ్‌ యాప్‌ కలకలం.. గూఢచర్యం ఆరోపణలు!)

మరిన్ని వార్తలు