ఒమిక్రాన్‌ భారత్‌: అంతా అయోమయం.. గందరగోళమే!

24 Jan, 2022 16:37 IST|Sakshi

భారత్‌లో థర్డ్‌ వేవ్‌ను దాదాపుగా ఒమిక్రాన్‌ వేవ్‌గా పరిగణిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. శరవేగంగా చొచ్చుకుపోతున్న ఈ వేరియెంట్‌.. ఎక్కువ మందిలో మైల్డ్‌ సింటమ్స్‌ చూపిస్తుండడం గమనార్హం. అదే టైంలో దగ్గు, జలుబు, జ్వరాల లక్షణాలతో తమకు సోకింది కరోనాయేనా? కాదా? అనే గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారు కోట్ల మంది!. 


భారత్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. అయితే వ్యాక్సినేషన్‌, తీవ్రత లేని వేరియెంట్ల వల్ల ప్రభావం తక్కువగా ఉందని ప్రభుత్వ వైద్య నిపుణులు పేర్కొంటున్నప్పటికీ.. ఒకవైపు రెండు డోసులు తీసుకున్న వాళ్లపైనా వైరస్‌ దాడి చేస్తుండడం, మరోవైపు ఆస్ప్రత్రుల్లో, ఐసీయూల్లో చేరుతున్న సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల పేషెంట్ల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుండడం.. కరోనా తీవ్రత ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ తరుణంలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ రానున్న రోజుల్లో మరింత విజృంభించనుందనే ప్రకటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. 

ఇప్పటికే సామాజిక వ్యాప్తిలో ఉన్న ఒమిక్రాన్‌ వేరియెంట్‌.. ముందు ముందు మరింత ప్రభావం చూపెట్టనుందనేది కొందరు టాప్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెప్తున్న మాట. ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెప్తున్నా.. ఆస్పత్రుల్లో పేషెంట్లు నిండిపోవడం, పాజిటివిటీ రేటు-మరణాలు పెరగడం,  ప్రభుత్వాల తరపున టెస్ట్‌ల సంఖ్య తగ్గిపోతుండడం, లక్షణాలున్నా జనాలు టెస్టులకు ఆసక్తి చూపించకపోవడం లాంటి కారణాలు ఉంటున్నాయి. కాబట్టి, కరోనా సాధారణం అయిపోయిందన్న వాదనను పక్కనపెట్టి.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తు‍‍న్నారు.


రోజూ తగ్గినా.. వారం పెరిగింది

గత 24 గంటల్లో దేశంలో 3,06,064 కొత్త కేసులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించుకుంది. అంటే సగటు డెయిలీ కేసులు 8 శాతం తగ్గిందని, మరణాలు 439 నమోదు అయ్యాయని, గత ఐదు రోజుల్లో ఇవే తక్కువ మరణాలని కేంద్రం ప్రకటించింది. సాధారణంగా వారాంతంలో టెస్టులు జరిగేవి తక్కువ. తద్వారా వచ్చే ఫలితాల సంఖ్య కూడా తక్కువే ఉంటోంది. ఈ తరుణంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయంటూ ఆరోగ్య శాఖ ప్రకటన ఆశ్చర్యం కలిగించేదే!. కానీ, వీక్లీ పాజిటివిటీ రేటు గనుక చూసుకుంటే.. భారీ స్థాయిలో పెరుగుతూ వస్తోంది. 

కిందటి నెలలో(డిసెంబర్‌ 2021, 27వ తేదీన) పాజిటివిటీ రేటు 0.63 శాతంగా ఉంది. అది జనవరి 24 నాటికి 17.03 శాతానికి చేరుకుంది. కిందటి వారం మరణాలు 1,396 నమోదుకాగా.. జనవరి 17-23 తేదీల మధ్య 2,680 మరణాలు నమోదు అయ్యాయి.  ఇందుకు కారణం.. ఒమిక్రాన్‌ వేరియెంట్‌తో ఉధృతంగా పెరుగుతున్న కరోనా కేసులే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 


ఆర్టీపీసీఆర్‌కు చిక్కకుండా.. 

కరోనా ఒమిక్రాన్ వేరియంట్‌లో ‘దొంగ ఒమిక్రాన్‌’ అనే ఉపరకం ఈ ఆందోళనకు మూలకారణం. ‘బీఏ.2’.. ఇది ఆర్టీపీసీఆర్ టెస్ట్ లకు దొరక్కుండా విస్తరిస్తుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.  ఒమిక్రాన్‌లో బీఏ.1, బీఏ.2, బీఏ.3 ఉపరకాలు ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఇందులో బీఏ.1 ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో విస్తరించింది. ఇప్పుడు బీఏ.2 కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో వేరియెంట్‌ విస్తరిస్తున్నా.. బయటపడక పోవడానికి కారణం బీఏ.2 కేసులు.. బీఏ.1 వేరియెంట్‌ను దాటి పోవడమే కారణంగా భావిస్తున్నారు సైంటిస్టులు. 

బీఏ.1 మ్యూటేషన్ లో ఎస్ లేదా స్పైక్ జీన్ తొలగిపోవడం అన్నది ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో గుర్తించొచ్చు. కానీ, బీఏ.2 మ్యూటేషన్ భిన్నంగా ఉంది. దీంతో ఇది ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో చాలామందికి ‘పాజిటివ్‌’ నిర్ధారణ కావడం లేదు.

ఫిబ్రవరిలో.. 
కరోనా తారాస్థాయికి చేరడం గురించి జనవరి మొదటి వారం నుంచే విస్తృతస్థాయిలో చర్చ నడుస్తోంది. ప్రస్తుత ఉధృతి కొనసాగితే.. ఫిబ్రవరి 15 నుంచి భారత్‌లో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టవచ్చని కేంద్ర వర్గాలు చెప్తున్నాయి. కానీ, ఆరోగ్య నిపుణలు మాత్రం రాబోయే వారాలే మరి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్త: సాధారణ జలుబుగానే వచ్చి వెళ్లిపోతోందని ఒమిక్రాన్‌ను లైట్‌ తీసుకోవద్దు!

తలనొప్పి, గొంతులో గరగరా?

మరిన్ని వార్తలు