పిల్లలపై ఒమిక్రాన్‌ పడగ; 7 ఏళ్ల బాలుడికి పాజిటివ్‌

15 Dec, 2021 19:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

7 Year Old Boy Tested Omicron Positive: భారత్‌లో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పిల్లలు సైతం కొత్త వేరియంట్‌ కాటుకు గురవుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో మొదటి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడికి  ఒమిక్రాన్‌ సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణయింది. 

ఈ చిన్నారి తల్లిదండ్రులతో కలిసి అబుదాబి నుంచి డిసెంబర్‌ 10న హైదరాబాద్ మీదుగా బెంగాల్‌కు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీ- పీసీఆర్‌ పరీక్ష కోసం నమూనాలు సేకరించారు. బాలుడి నుంచి సేకరించిన నమూనాలో జీనోమ్ సీక్వెన్సింగ్ ఓమిక్రాన్ వేరియంట్‌ను చూపించింది. బాలుడి తల్లిదండ్రులకు ఒమిక్రాన్‌ సోకలేదని, వైద్య పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిందని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వారికి సమాచారం అందించారు. దీంతో బాలుడిని ముర్షిదాబాద్ జిల్లాలో స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

కాగా, తెలంగాణ రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ సర్కారు ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఇండియాలో ఒమిక్రాన్‌ కేసులు 40 దాటాయని వార్తలు వస్తున్నాయి. (చదవండి: చిన్నారులపై ఒమిక్రాన్‌ ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు)

మరిన్ని వార్తలు