కోవిడ్‌-19 : మృతుల్లో 45 శాతం వారే!

14 Oct, 2020 13:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో మరణాల ముప్పు వృద్ధులకే అధికంగా ఉంటుందన్న అంచనాలు సరైనవి కావని, 60 సంవత్సరాల లోపు వయసున్న వారికీ కోవిడ్‌-19తో ముప్పు అధికమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా విశ్లేషణలు స్పష్టం చేశాయి. భారత్‌లో చోటుచేసుకున్న కరోనా మరణాల్లో 45 శాతం మంది 60 సంవత్సరాలలోపు వారేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా వైరస్‌తో మరణించిన వారిలో మహిళల కంటే పురుషుల సంఖ్యే అధికంగా ఉందని ఈ విశ్లేషణ వెల్లడించింది. 44-60 ఏళ్ల వయసు వారిలో మరణాల సంఖ్య 35 శాతం కాగా, 26-44 వయసు వారిలో మరణాల సంఖ్య 10 శాతంగా ఉందని పేర్కొంది. 60 సంవత్సరాలు పైబడిన వారిలో కరోనా మరణాల రేటు 53 శాతంగా నమోదైంది.

ఇక 17 సంవత్సరాల లోపు యువతలో కరోనా మరణాలు కేవలం 1 శాతం ఉండగా, 18-25 సంవత్సరాల వయసు వారిలోనూ మరణాల రేటు కూడా 1 శాతంగా నమోదైంది. వయో వృద్ధులతో పాటు పలు వ్యాధులతో బాధపడే వారికి కరోనా వైరస్‌ ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 44-60 సంవత్సరాల వయసు వారిలో కరోనా మరణాలు ఆందోళనకరమని, తాము యువకులం కావడంతో తమకు వైరస్‌ సోకదని, వైరస్‌ సోకినా తాము కోలుకోగలమని భావిస్తారని, అలాంటి అపోహలు సరైందికాదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ స్పష్టం చేశారు. ఇక పలు వ్యాధులతో బాధపడేవారికి కోవిడ్‌-19తో ముప్పు అధికమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.

45-60 ఏళ్ల వయసు వారిలో వివిధ వ్యాధుల కారణంగా సంభవించిన మరణాలు 13.9 శాతంగా నమోదయ్యాయి. ఎలాంటి ఇతర వ్యాధులు లేని వారిలో మరణాల సంఖ్య 1.5 శాతంగా ఉంది. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇతర వ్యాధులతో చోటుచేసుకున్న మరణాలు 24.6 శాతం కాగా, ఇతర వ్యాధులు లేని వారిలో మరణాల రేటు 4.8 శాతంగా ఉంది. 45 ఏళ్ల లోపు వారిలో ఇతర వ్యాధులతో బాధపడుతూ 8.8 శాతం మరణించగా, ఇతర వ్యాధులు లేనివారిలో మరణాల రేటు కేవలం 0.2 శాతంగా ఉంది. గుండె జబ్బులు, ప్రధాన అవయవాల మార్పిడి జరిగిన వారు, క్యాన్సర్‌ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ కోరారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 మరణాల రేటు 1.53 శాతంగా ఉందని ఆయన వివరించారు. చదవండి : ‘కో ఇన్‌ఫెక్షన్‌’పై జర జాగ్రత్త!

మరిన్ని వార్తలు