అంత‌రాష్ట్ర ప్ర‌యాణాలపై ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్‌..

7 May, 2021 17:46 IST|Sakshi

కీల‌క సూచ‌న‌లు చేసిన ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు.. అంత‌రాష్ట్ర ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించాయి. ఇత‌ర రాష్ట్రాల వారు త‌మ ప్రాంతంలోకి ప్ర‌వేశించాలంటే కోవిడ్ నెగిటివ్ రిపోర్టు త‌ప్ప‌నిస‌రి చేశాయి. ఈ నేప‌థ్యంలో ఐసీఎంఆర్ అంత‌రాష్ట్ర ప్ర‌యాణాల‌కు సంబందించి కీల‌క సూచ‌న‌లు చేసింది. పూర్తి ఆరోగ్యంగా ఉండి.. ఒంట‌రిగా  అంత‌రాష్ట్ర ప్ర‌యాణాలు చేసేవారికి ఆర్‌టీపీసీఆర్ రిపోర్ట్ అవ‌స‌రం లేద‌ని ఐసీఎంఆర్ స్ప‌ష్టం చేసింది.

తాజా ఉత్త‌ర్వులు ఒంట‌రిగా అంత‌రాష్ట్ర ప్ర‌యాణాలు చేసే వారికి ఎంతో ఊర‌ట‌నిస్తాయి. ఇప్ప‌టికే లాక్‌డౌన్ విధించిన ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌యాణాల‌కు ఈ పాస్ త‌ప్ప‌నిస‌రి చేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో సాధార‌ణ జ‌లుబు, ఫ్లూ ల‌క్ష‌ణాలున్న వారు ప్ర‌యాణాలు వాయిదా వేసుకుంటున్నారు. అత్య‌వ‌స‌రం అనుకున్న వారు టెస్ట్‌లకు వెళ్తున్నారు. దాంతో కోవిడ్ ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద ర‌ద్దీ పెరుగుతుంది. 

దేశంలో పెరుగుతున్న కేసుల‌తో ఇప్ప‌టికే ప‌రీక్షా కేంద్రాల‌పై ఒత్తిడి పెరిగింది. దీన్ని త‌గ్గించ‌డం కోస‌మే ఐసీఎంఆర్ ఈ ప్ర‌క‌ట‌న చేసింది. ఆర్‌టీపీసీఆర్ ద్వారా ఒక్క‌సారి పాజిటివ్ వ‌చ్చిన వ్య‌క్తికి త‌ర‌చుగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. కోవిడ్ బారిన ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స్ పొందుతున్న వ్య‌క్తికి డిశ్చార్జ్ స‌మయంలో మ‌రోసారి టెస్ట్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఇప్ప‌టికే కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. 

దేశవ్యాప్తంగా ఇప్ప‌టికే ఆర్‌టీపీసీఆర్‌, ట్రూనాట్, సీబీఏనాట్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫారమ్‌లతో క‌లిపి మొత్తం 2,506 మాలిక్యులర్ టెస్టింగ్ లాబొరేటరీలు ఉన్నాయి. ప్ర‌తి రోజు మూడు-షిఫ్ట్‌ల ద్వారా 15 ల‌క్ష‌ల ప‌రీక్ష‌లు చేయ‌గ‌ల సామార్థ్యం వీటి సొంతం. 

చ‌ద‌వండి: కరోనా ప్రళయం.. భయం గుప్పిట్లో ప్రజలు!

మరిన్ని వార్తలు