Coronavirus: కట్టలు తెంచుకుంటున్న కరోనా

28 Mar, 2021 05:29 IST|Sakshi
బికనీర్‌లో 99 ఏళ్ల హుకమ్‌ చంద్‌ కొచ్చర్‌కు కోవిడ్‌ టీకా ఇస్తున్న దృశ్యం

24 గంటల్లో 62,258 కేసులు

ఆరు రాష్ట్రాల్లో 79.57 శాతం కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. కట్టను తెంచుకున్న గంగమ్మలా పోటెత్తుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 62,258 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గతేడాది అక్టోబర్‌ 16 నుంచి పోలిస్తే ఒకరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,19,08,910కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా 291 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,61,240 కు చేరింది.

కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,12,95,023 కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 94.85 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,52,647గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 3.80   శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.35గా ఉంది. ఇప్పటివరకూ వరకూ 23,97,69,553 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

ఆరు రాష్ట్రాల్లో..
కొత్త కేసుల్లో 79.57 శాతం కేసులు కేవలం ఆరు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. వీటిలో మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. ఇందులోనూ మహారాష్ట్రలో అత్యధికంగా 36,902 కేసులు నమోదయ్యాయి. కేవలం మహారాష్ట్ర, పంజాబ్, కేరళల్లోనే 73 శాతం కేసులు నమోదయ్యాయి. 10 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకూ 5.8 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

టెస్టుల సంఖ్యను పెంచండి: కేంద్రం
దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు గణనీయంగా పెరగడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్ర అధికారులతో ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. ప్రత్యేకించి 12 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న తీరును ఆయన రాష్ట్రాల దృష్టికి తీసుకొచ్చారు. 12 రాష్ట్రాల్లోనూ ప్రత్యేకించి 46 జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కోవిడ్‌ సోకిన వారిని టెస్టుల ద్వారా గుర్తించి, వారిని కాంటాక్ట్‌ అయిన వారిని కూడా ట్రేస్‌ చేయడం ద్వారా కేసులను అదుపు చేయొచ్చన్నారు. 45 ఏళ్లు దాటిన కేసుల్లోనే మరణాలు అధికంగా జరుగుతున్నాయని అన్నారు. కరోనాను మాస్క్‌ ద్వారా కట్టడి చేయవచ్చని 90 శాతం మందికి తెలిసినా, వారిలో 44 శాతం మాత్రమే మాస్కులు ధరిస్తున్నారని అన్నారు. కోవిడ్‌ సోకిన ఒక వ్యక్తి నెలలో 406 మందికి దాన్ని వ్యాప్తి చేయగలడని అన్నారు. కోవిడ్‌ వ్యాప్తిస్తున్న రాష్ట్రాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు