ఈ ఐదు ముఖ్యం అంటున్న‌ భార‌తీయులు

7 Aug, 2020 14:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏ కాల‌మైనా స‌రే, ఏ విప‌త్తులు వ‌చ్చినా స‌రే భార‌తీయులు వారి అల‌వాట్లు, ఇష్టాయిష్టాలు మార్చుకోలేరు. డ‌బ్బులు కూడ‌బెట్టి ఇష్టంగా కొనుక్కున్న బంగారాన్ని క‌ష్ట‌కాలంలో తాక‌ట్టు పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడ‌రు. ప‌ని లేక‌పోయినా పొట్ట మాత్రం ఖాళీగా ఉంచ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. అయితే క‌రోనా వ‌ల్ల తిరిగి ఆయుర్వేద ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తూ లాక్‌డౌన్ తెచ్చిన తంటాల వ‌ల్ల‌ ఆధునికత‌ను ఒడిసిపట్టుకుంటున్నారు . ఇలా కొన్ని అల‌వాట్ల‌ను వారి జీవ‌న‌శైలిలో భాగ‌స్వామ్యం చేసుకోవ‌డం మంచి ప‌రిణామం. మ‌రి మ‌న‌వాళ్లు ఈ క‌ష్ట‌కాలంలో వేటిని ఎక్కువ‌గా కొనుగోలు చేశారు? దేనిపై ప్ర‌త్యేకంగా దృ‌ష్టి సారిస్తున్నారో చూసేద్దాం..

రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించేవి
ఒక్క మ‌న‌దేశంలోనే కాదు, ప్ర‌పంచమంతా ఇప్పుడు వీటి మీదే దృష్టి కేంద్రీక‌రించింది. ఎంత‌టి రోగాన్నైనా త‌ట్టుకునే శ‌క్తి మ‌న శ‌రీరంలో ఉండాల‌న్న విష‌యంతో జ‌నాలు ఇప్పుడిప్పుడే ఏకీభ‌విస్తున్నారు. దీంతో స‌హ‌జంగానే ఆయుర్వేదం, ఇంటి చిట్కాలను ఫాలో అవుతున్నారు. స‌హ‌జ ఉత్ప‌త్తుల‌ను అందించే డాబ‌ర్‌, హిమాల‌య కంపెనీలకు గిరాకీ పెర‌గ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. స‌హ‌జ మూల‌కాల‌తో తయారు చేసిన చ్యావ‌న్‌ప్రాష్ అమ్మ‌కాలు ఏప్రిల్ నుంచి జూన్ మ‌ధ్య 700 శాతం పెరిగాయ‌ని డాబ‌ర్ కంపెనీ తెలిపింది. అలాగే తేనే అమ్మ‌కాల్లోనూ 39 శాతం పెరుగుద‌ల క‌నిపించిన‌ట్లు పేర్కొంది. (‘ఎక్కువ జాబ్‌లు లేవు.. అందుకే ఇది’)

ఆహారం
ప్యాకేజ్‌డ్ ఫుడ్‌కే వినియోగ‌దారులు మ‌రోసారి జై కొట్టారు. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండటమే ఇందుకు కార‌ణం. బియ్యంతోపాటు అల్పాహారానికి అవ‌స‌ర‌మ‌య్యే తృణధాన్యాలు, నూడుల్స్ ఈ లిస్టులో ఉన్నాయి. ముఖ్యంగా రెండు నిమిషాల్లో రెడీ అయ్యే మ్యాగీ నూడుల్స్ అమ్మ‌కాలు మార్చిలో 10.7 శాతం పెరిగాయి. అలాగే కిట్‌క్యాట్‌, మంచ్ చాక్లెట్ల కొనుగోళ్లు కూడా పెరిగాయ‌ని హాయ్‌టాంగ్ సెక్యూరిటీస్ కంపెనీ అన‌లిస్టులు గౌరాంగ్ క‌క్క‌డ్‌, ప్రేమ‌ల్ కందార్ పేర్కొన్నారు. అతి సామాన్యుడికి కూడా అందుబాటు ధ‌ర‌లో ల‌భ్య‌మ‌య్యే పార్లీజీ బిస్కెట్ ప్యాకెట్ సేల్స్ రికార్డు స్థాయిలో జ‌రిగాయి.

డిజిట‌ల్ సేవ‌లు
పిల్లలు ఆన్‌లైన్ పాఠాలు కోసం, పెద్ద‌లు బిజినెస్ మీటింగ్‌ల కోసం డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌పై ఆధార‌ప‌డ‌క త‌ప్ప‌లేదు. ఆన్‌లైన్ పాఠాలు అందించే బైజులో చేరే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింద‌ని దాని మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేటు చెప్పుకొచ్చింది. మ‌రోవైపు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ త‌ప్ప‌నిస‌రైన నేప‌థ్యంలో ఆన్‌లైన్ షాపింగ్ అడ్డా ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌ట్యాప్‌ల కోసం వెతికే వారి సంఖ్య రెండితలైంది. ఒక్క మే నెల‌లోనే వినోదాన్ని అందించే జీ5 ఓటీటీని ఆశ్ర‌యించిన‌వారి సంఖ్య 33శాతం ఎగ‌బాకింద‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. (జిమ్‌లు రేపట్నుంచే..)

బంగారం రుణాలు
భార‌తీయుల‌కు బంగారం అంటే మక్కువ ఎక్కువ‌. దీన్ని తాక‌ట్టు పెట్టి రుణాలు తీసుకోడానికి ప్రాధాన్య‌త‌నిస్తారే త‌ప్ప అమ్మ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. లాక్‌డౌన్ దెబ్బ‌తో ఉపాధి కోల్పోయిన సామాన్యులు, చిరు వ్యాపారులు, పేద‌లు క‌ష్టాల‌ను గ‌ట్టెక్కించ‌డానికి బంగారం తాక‌ట్టు పెట్టి అప్పులు తీసుకుంటున్నారు. దీంతో మ‌ణిపురం ఫైనాన్స్ లిమిటెడ్‌, ముత్తూట్ ఫైనాన్స్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియ‌ల్ కంపెనీలు బంగారంపై ఎక్కువ రుణాలు ఇస్తూ వ‌డ్డీలు ఆర్జిస్తున్నాయి. దీంతో వీటి షేర్లు అమాంతం పెరిగాయి. (బంగారం డిమాండ్‌ 70% డౌన్‌)

ఉప‌క‌ర‌ణాలు
ఇంట్లో శ్ర‌మ‌ను త‌గ్గించుకునేందుకు అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను కొనుగోలు చేయడానికి ఇండియ‌న్స్ ఏమాత్రం వెన‌కడుగు వేయ‌లేదు. మిక్సీలు, మైక్రోవేవ్‌లు, టోస్ట‌ర్లు వంటి వ‌స్తువుల‌కు జూలైలో విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింద‌ని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. వాక్యూమ్ క్లీన‌ర్ల వంటి శుభ్ర‌త కోసం వినియోగించే ప‌రికరాల అమ్మ‌కాలు నాలుగింత‌లు అయ్యాయ‌ని పేర్కొంది. మొన్న‌టివ‌ర‌కు సెలూన్లు తెరుచుకునేందుకు ప్ర‌భుత్వం నిషేధం విధించ‌డంతో ఇంట్లోనే జుట్టు క‌త్తిరించేందుకు, గ‌డ్డం గీసుకునేందుకు అవ‌స‌ర‌మైన‌ ట్రిమ్మ‌ర్ వంటి ప‌రిక‌రాలను ప్ర‌జ‌లు కొని పెట్టుకున్నారు. దీంతో ట్రిమ్మ‌ర్ల అమ్మ‌కాలు 5 రెట్లు పెరిగాయ‌ని హావెల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ చెప్పుకొచ్చింది. 
మొత్తంగా భార‌తీయులు ఇంట్లోకి అవ‌స‌ర‌మ‌య్యే వ‌స్తువుల కొనుగోలుపై ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నార‌ని మింటెల్ అధ్య‌య‌నం పేర్కొంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు