ISRO GSLV-F14: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 రాకెట్‌ ప్రయోగం విజయవంతం​

17 Feb, 2024 18:32 IST|Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహకనౌక 2,275 కిలోల బరువు గల వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు దీనిని ప్రయోగించారు. పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది.

గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్‌–3డీ, ఇన్‌శాట్‌–3డీఆర్‌ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్‌శాట్‌–3డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్‌శాట్‌–3డీఎస్‌ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి.

ప్రయోగం మొదలైన 20 నిమిషాల తర్వాత జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌(జీటీవో)లో శాటిలైట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం దశలవారీగా రెండు రోజులపాటు కక్ష్యను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిట్‌లోకి మారుస్తారు.

whatsapp channel

మరిన్ని వార్తలు