నా భర్తకు బెడ్‌ ఇప్పించండయ్యా... అంతలోనే..

7 May, 2021 15:01 IST|Sakshi

శివాజీనగర/యశవంతపుర: ‘అయ్యా నా భర్తను కాపాడండి.. కరోనాతో చనిపోయేలా ఉన్నాడు.. ఏదైనా ఆస్పత్రిలో బెడ్‌ ఇప్పించండి..’ అంటూ ఒక మహిళ ఏకంగా సీఎం యడియూరప్ప ఇంటి ముందు విలపిస్తూ బైఠాయించింది. కరోనా బాధితులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో బెంగళూరులో బెడ్లకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం ఒక మహిళ భర్త (50)కు కరోనా సోకగా పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా చేర్చుకోలేదు. దీంతో విసిగిపోయిన ఆమె భర్తను తీసుకొచ్చి సీఎం యడియూరప్ప బంగ్లా ‘కావేరి’ ముందు బైఠాయించింది.

‘కోవిడ్‌ హెల్ప్‌లైన్‌ బిజీ అని వస్తోంది, ఏ ఆస్పత్రికి వెళ్లినా బెడ్‌ లేదంటున్నారు, దయచేసి బెడ్‌ ఇప్పించండి’ అని విలపించసాగింది. లేదంటే తన భర్తను అక్కడే చనిపోనివ్వండంటూ స్పష్టం చేసింది. ఆమె గోడు చూడలేని సీఎంఓ ఉద్యోగులు చివరికి ఓ ప్రైవేటు ఆస్పత్రి వారితో మాట్లాడి అంబులెన్స్‌లో అక్కడికి పంపించారు. కానీ, విధి వక్రించి కరోనా బాధితుడు మార్గమధ్యలోనే కన్నుమూశాడు. 

కరోనా బాధిత బాలిక ఆత్మహత్య 
హోం క్వారంటైన్‌లో ఉన్న 12 ఏళ్లు చిన్నారి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఉడుపి జిల్లా బైందూరు తాలూకాలో జరిగింది. కొడేరికి చెందిన తన్విత (12) కుటుంబంలో అందరికీ పాజిటివ్‌ వచ్చింది. దీనితో అధికారులు వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఎవరూ బయటకు అడుగు పెట్టరాదని చెప్పారు. ఈ పరిణామాలతో ఆందోళనకు గురైన తన్విత మేడపైకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు