హృదయవిదారకం: కరోనా మృతదేహాలను పీక్కుతింటున్నాయి

1 Jun, 2021 19:15 IST|Sakshi

డెహ్రాడూన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేస్తోంది. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే వ్యాధి కావడంతో ప్రతీ ఇంట్లోనూ కరోనా వచ్చిన వారిని దూరంగా ఉంచుతున్నారు. అలా కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంగతి వర్ణనాతీతం. కరోనాతో ఒక వ్యక్తి చనిపోతే.. ఆ ఇంటి కుటుంబసభ్యులు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయడానికి కూడా భయపడుతున్నారు. వారికి ఎక్కడ సోకుతుందో అని భయపడి దూరంగా ఉండే వారికి అంతిమ సంస్కారాలు కానిస్తున్నారు. 

తాజాగా కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం చూసి అక్కడి స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర కాశీలోని భాగీరథీ నదీ తీర ప్రాంతంలోని కేదార్‌ ఘాట్‌ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. కరోనాతో మృతి చెందినవారికి భాగీరథీ నదీ తీరంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం కొన్ని మృతదేహాలను ఖననం చేస్తుండగా.. మరికొన్నింటిని చితి పేర్చి కాలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మృతదేహాలు సగం మాత్రమే కాలినా వాటిని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తున్నారు. దీంతో వీధి కుక్కుల అక్కడికి చేరుకొని సగం కాలిన శవాల శరీర బాగాలను పీక్కు తింటున్నాయి. ఇది చూసిన అక్కడి స్థానికులు వీటిని ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

కాగా ఒక వ్యక్తి ఈ ఘటనపై స్పందిస్తూ.. ''ఇది చాలా హృదయవిదారకం.. భాగీరథి నదీ తీరానా సగం కాలిన శవాలను కుక్కుల పీక్కు తింటుంటే నా మనసు చెమ్మగిల్లింది. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో మృతదేహాల ఒడ్డుకు కొట్టుక వస్తున్నాయి. వీధి కుక్కలు ఆ శవాలను పీక్కుతింటున్నాయి. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఆ మృతదేహాలు కరోనా సోకినవారివైతే వ్యాధి మరింత వ్యాపించే అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: 'నా ఆత్మహత్య కశ్మీర్‌ ప్రభుత్వ టీచర్లకు అంకితం'

మరిన్ని వార్తలు