Lok Sabha elections 2024: ‘మోదీ గ్యారంటీల’తో గెలుస్తాం

2 Mar, 2024 05:11 IST|Sakshi

ఎన్డీయేకు 400 సీట్లు తథ్యం

నా జీవితంలో ప్రతిక్షణం ప్రజలకే అంకితం: మోదీ 

జార్ఖండ్, పశి్చమ బెంగాల్‌లో  పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన  

బర్వాడా/సింద్రీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400కుపైగా సీట్లు సాధించడం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మోదీ గ్యారంటీలే తమను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా ‘మోదీ గ్యారంటీ’ అనే నినాదం గట్టిగా వినిపిస్తోందని చెప్పారు. ప్రజల ఆశలు అంతమైన చోటునుంచే మోదీ గ్యారంటీ ప్రారంభమవుతుందని మరోసారి స్పష్టం చేశారు.

శుక్రవారం జార్ఖండ్‌ రాష్ట్రం ధన్‌బాద్‌ జిల్లాలోని సింద్రీలో రూ.35,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అనంతరం ‘విజయ్‌ సంకల్ప్‌ మహార్యాలీ’లో ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అబివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా కూడా ఒకటి అని గుర్తుచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో 8.4 వృద్ధిరేటు నమోదైందని, ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉందని వెల్లడించారు.   

ప్రజల కలలే మా ప్రతిజ్ఞ  
అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. జార్ఖండ్‌లో అధికార జేఎంఎం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. రూ.350 కోట్ల నగదుతో జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ సాహూ దొరికిపోవడాన్ని మోదీ ప్రస్తావించారు. అన్ని నోట్ల కట్టలు తన జీవితంలో ఏనాడూ చూడలేదని అన్నారు. ఆ సొమ్మంతా జార్ఖండ్‌ ప్రజలదేనని తేలి్చచెప్పారు.

భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాల్సిన డబ్బును కాంగ్రెస్‌ నేతలు లూటీ చేశారని ధ్వజమెత్తారు.  వారు దోచుకున్న సొమ్మును తిరిగి వసూలు చేసి, ప్రజలకు అందజేస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని చెప్పారు. జార్ఖండ్‌ ప్రజలు కష్టపడి పనిచేస్తారని, వారి కష్టం వృథా కానివ్వబోమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఎంత బురద చల్లినా కమలం(బీజేపీ గుర్తు) ప్రతిచోటా వికసిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.

‘ప్రజల కలలే మా ప్రతిజ్ఞ, వారి సంక్షేమమే మోదీ గ్యారంటీ’ అని స్పష్టం చేశారు. తన జీవితంలో ప్రతిక్షణం ప్రజలకే అంకితం అని పేర్కొన్నారు. జనం బాగు కోసమే తాను పని చేస్తున్నానని వెల్లడించారు. దేశంలో గత పదేళ్లలో ఏకంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని హర్షం వ్యక్తం చేశారు. పేదరికాన్ని పూర్తిగా అంతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నామని తెలిపారు.    

సందేశ్‌ఖాలీపై నోరు విప్పరెందుకు?  
ప్రధాని మోదీ శుక్రవారం పశి్చమ బెంగాల్‌లో పర్యటించారు. హుగ్లీ జిల్లాలోని అరామ్‌బాగ్‌లో రూ.7,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వ పాలనలో అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయని మోదీ మండిపడ్డారు. సందేశ్‌ఖాలీలో మహిళలు ఘోరమైన అకృత్యాలు జరిగాయని, దీనిపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఎందుకు నోరువిప్పడం లేదని నిలదీశారు. సందేశ్‌ఖాలీలో మన అక్కచెల్లెమ్మలను తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు వేధించారని, అత్యాచారాలు చేశారని, ఇది నిజంగా సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. నిందితులను తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు