ఈసీ గోయల్‌ రాజీనామా

10 Mar, 2024 04:26 IST|Sakshi

వెంటనే రాష్ట్రపతి ఆమోదం

త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌

ఆ ఏర్పాట్లలో గోయల్‌దే చురుకైన పాత్ర

2027 డిసెంబర్‌ దాకా పదవీకాలం

అయినా అనూహ్య నిర్ణయం

ఇటీవలే రిటైరైన మరో కమిషనర్‌ పాండే

ఈసీలో మిగిలింది సీఈసీ రాజీవ్‌ కుమారే

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ ఆకస్మికంగా రాజీనామా చేశారు. శనివారం సాయంత్రం ఆయన రాజీనామా చేయడం, ఆ వెంటనే దాన్ని రాష్ట్రపతి ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. గోయల్‌ పదవీకాలం 2027 డిసెంబర్‌ దాకా ఉంది. పైగా 2025 ఫిబ్రవరిలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ రిటైరయ్యాక గోయలే సీఈసీ కావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో మూడున్నరేళ్ల ముందే ఆయన రాజీనామా చేయడానికి కారణాలేమిటన్నది తెలియరాలేదు. మరో కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే గత ఫిబ్రవరిలోనే రిటైరయ్యారు. ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల సంఘంలో అప్పటినుంచీ ఒక స్థానం ఖాళీగానే ఉంది.

ఇప్పుడు గోయల్‌ కూడా తప్పుకోవడంతో కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మాత్రమే మిగిలారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లు రాజీనామా చేయడం ఇది తొలిసారేమీ కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన పలు కేసుల్లో ఈసీ తీసుకున్న నిర్ణయాలపై నాటి ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసా తీవ్ర అసమ్మతి తెలిపారు. అనంతరం 2020 ఆగస్టులో రాజీనామా చేశారు.

తొలుత ఒక్కరే...
ఎన్నికల సంఘంలో తొలుత సీఈసీ ఒక్కరే ఉండేవారు. ఆయన అపరిమిత అధికారాలు చలాయిస్తున్నారన్న అభిప్రాయాల నేపథ్యంలో ఈసీలో మరో ఇద్దరు కమిషనర్లను నియమిస్తూ 1989లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పట్నుంచి ఈసీ తీసుకునే నిర్ణయాల్లో మెజారిటీ అభిప్రాయమే చెల్లుబాటవుతూ వస్తోంది.

గోయల్‌ నియామకమూ వివాదమే...
అరుణ్‌ గోయల్‌ 1985 పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన నియామకమూ వివాదాస్పదంగానే జరిగింది. 2022 నవంబర్‌ 18న గోయల్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేయగా అదే రోజు కేంద్రం ఆమోదించింది. ఆ మర్నాడే ఈసీగా నియమించింది. దీన్ని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇదేం నియామకమంటూ విచారణ సందర్భంగా కోర్టు కూడా ఆశ్చర్యపోయింది. గోయల్‌ స్వచ్ఛంద పదవీ విరమణ, ఈసీ నియామక ఫైళ్లు మెరుపు వేగంతో కదలడం, మొత్తం ప్రక్రియ 24 గంటల్లోపే పూర్తవడంపై విస్మయం వెలిబుచి్చంది. అంత వేగంగా ఎందుకు నియమించాల్సి వచి్చందని కేంద్రాన్ని నిలదీసింది కూడా.  

ఇప్పుడేం జరగనుంది...?
ఈసీ సభ్యుల ఎన్నిక ప్రక్రియకు అనుసరిస్తున్న 1991 నాటి చట్టానికి కీలక మార్పుచేర్పులు చేస్తూ కేంద్రంలోని మోదీ సర్కారు ఇటీవల కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, కమిషనర్ల (నియామకం, పదవీ నిబంధనలు, పదవీకాలం) చట్టం తెచ్చింది. దీని ప్రకారం ఎన్నికల కమిషనర్‌ పదవికి కేంద్ర న్యాయ మంత్రి సారథ్యంలోని సెర్చ్‌ కమిటీ ముందుగా ఐదు పేర్లను షార్ట్‌ లిస్ట్‌ చేస్తుంది. వారిలోంచి ఒకరిని ప్రధాని సారథ్యంలోని కమిటీ ఎంపిక చేస్తుంది.

కమిటీలో ప్రధానితో పాటు ఒక కేంద్ర మంత్రి, లోక్‌సభలో విపక్ష నేత సభ్యులుగా ఉంటారు. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ప్రధాని తనకు అనుకూలమైన వారినే ఎన్నికల కమిషనర్లుగా నియమించుకునేందుకు ఇది వీలు కలి్పస్తోందంటూ దుయ్యబట్టాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీలో రెండు ఖాళీల భర్తీ అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త చట్టం ప్రకారమే ముందుకు వెళ్లవచ్చన్న అభిప్రాయాలు విని్పస్తున్నాయి.

Election 2024

మరిన్ని వార్తలు