జాతీయ స్థాయి లాక్‌డౌన్‌కు ప్రధాని మోదీపై ఒత్తిడి

6 May, 2021 01:52 IST|Sakshi
కరోనా కట్టడి కోసం ఒడిశాలో లాక్‌డౌన్‌ విధించారు. రవాణా సౌకర్యం లేక రాజధాని భువనేశ్వర్‌ నుంచి కాలి నడకన సొంతూళ్లకు బయలుదేరిన వలస కూలీలు

సంక్రమణను నిలువరించేందుకు ఆంక్షల విధింపు 

సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా చర్యలు  

పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కారణంగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్న మరణాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో లాక్‌డౌన్‌ విధించాలని ప్రధాని మోదీపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం అనుకూలంగా లేదని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని సగానికి పైగా జిల్లాల్లో కరోనా నియంత్రణలో ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అటువంటి పరిస్థితిలో దేశవ్యాప్తంగా గతేడాది మాదిరిగా జాతీయస్థాయి లాక్‌డౌన్‌ విధించడం కారణంగా పేదలకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. అందుకే కొత్త కేసుల పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో పరిమిత లేదా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించారు. దీని ప్రభావం కనిపించడం ప్రారంభమైందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించారు... అక్కడ ఏ విధమైన ఆంక్షలు విధించారో ఓ సారి చూద్దాం.  

మహారాష్ట్ర: ఏప్రిల్‌ 5న కర్ఫ్యూ లాంటి లాక్‌డౌన్, నిషేధ ఉత్తర్వులతో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నిషేదాజ్ఞలు మే 15 వరకు పొడిగించారు.  
ఢిల్లీ: ఢిల్లీలో లాక్‌డౌన్‌ను 10వ తేదీ వరకు పొడిగించారు. ఏప్రిల్‌ 19 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.  
ఉత్తర్‌ప్రదేశ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ను మే 10 వరకు పొడిగించారు.  
ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లో లాక్‌డౌన్‌ను మే 15 వరకు పొడిగించారు. సంక్రమణ కొంత స్థాయిలో నియంత్రణలో ఉన్న రాయ్‌పూర్, దుర్గ్‌ జిల్లాల్లో కాలనీల్లోని కిరాణా దుకాణాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. అయితే సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌ ఉంటుంది.  
బిహార్‌: పెరుగుతున్న పాజిటివ్‌ కేసులను దృష్టిలో ఉంచుకుని బిహార్‌ ప్రభుత్వం మే 15 వరకు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని కార్యాలయాలు, దుకాణాలు, వాణిజ్య, ప్రైవేట్‌ సంస్థలు మూసివేయాలి. నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉదయం 7 నుండి 11 గంటల వరకు తెరిచి ఉంచుతారు.  

ఒడిశా: ఒడిశాలో మే 19 వరకు లాక్‌డౌన్‌ విధించారు. ఒడిశాలో 15 రోజుల లాక్డౌన్‌ మే 19 వరకు ఒడిశాలో కొనసాగుతుంది.  
పంజాబ్‌: మినీ లాక్‌డౌన్, వారాంతపు లాక్‌డౌన్‌ వంటి చర్యలతో పాటు, విస్తృతమైన ఆంక్షలు ఉన్నాయి. నైట్‌ కర్ఫ్యూ మే 15 వరకు అమలులో ఉంటుంది. 
రాజస్థాన్‌: లాక్‌డౌన్‌ ఆంక్షలు మే 17 వరకు అమలులో ఉన్నాయి. 
గుజరాత్‌: రాష్ట్రంలోని 29 పట్టణాల్లో నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది. బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలు నిషేధించారు.  
మధ్యప్రదేశ్‌: కరోనా కర్ఫ్యూ మే 7 వరకు అమలులో ఉంది.  
అస్సాం: నైట్‌ కర్ఫ్యూ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది. నైట్‌ కర్ఫ్యూ మే 7 వరకు అమలులో ఉంటుంది. 
తమిళనాడు: మే 20 వరకు అన్ని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధంసహా విస్తృతమైన ఆంక్షలు విధించారు.  
కేరళ: మే 9 వరకు లాక్‌డౌన్‌ తరహా కఠిన ఆంక్షలు ఉన్నాయి. 

కర్ణాటక: మే 12 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.  
జార్ఖండ్‌: ఏప్రిల్‌ 22 నుంచి మే 6 వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంది.  
గోవా: నాలుగు రోజుల లాక్‌డౌన్‌ సోమవారం ముగిసినప్పటికీ ఉత్తర గోవాలోని కలంగూట్, కాండోలిమ్‌ వంటి పర్యాటక ప్రదేశాలలో లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. కోవిడ్‌ –19 కారణంగా ఆంక్షలు మే 10 వరకు కొనసాగుతాయి. 
ఆంధ్రప్రదేశ్‌: మే 5వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు రెండు వారాల పాటు పాక్షిక కర్ఫ్యూ ప్రకటించారు.  
తెలంగాణ: నైట్‌ కర్ఫ్యూ మే 8 వరకు కొనసాగుతుంది. 
పుదుచ్చేరి: లాక్‌డౌన్‌ మే 10 వరకు పొడిగించారు.  
నాగాలాండ్‌: మే 14 వరకు కఠినమైన నిబంధనలతో పాక్షిక లాక్‌డౌన్‌ విధించారు.  
జమ్మూ కశ్మీర్‌: శ్రీనగర్, బారాముల్లా, బుద్గాం, జమ్మూ జిల్లాల్లో లాక్‌డౌన్‌ను మే 6 వరకు పొడగించారు. మొత్తం 20 జిల్లాల కార్పొరేషన్‌ / అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ సరిహద్దులో నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు